Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోల్సనారో డిమాండ్
బ్రసీలియా : ఎన్నికల్లో ప్రింటెడ్ బ్యాలట్ పత్రాలను ఉపయోగించాలంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో కోరారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థలో నెలకొన్న అవినీతిని నివారించవచ్చని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ప్రజాస్వామ్య రీతిలో, నిజాయితీగా, శుద్ధంగా జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. వారం వారం సోషల్ మీడియాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమంలో బోల్సనారో పై వ్యాఖ్యలు చేశారు. గత అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలంటూ ఆయన పలు ఇంటర్నెట్ వీడియో క్లిప్‌లు చూపించారు. బ్రెజిల్లో ప్రజాస్వామ్యం ముప్పులో వుందని అన్నారు. 2022 ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించకూడదనే లక్ష్యంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే బోల్సనారో కూడా ఎన్నికల వ్యవస్థ పట్ల సందేహాలు తలెత్తేలా అనుమాన బీజాలు నాటుతున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రెజిల్లో కరోనా ప్రబలిన నేపథ్యంలో అధ్యక్షుడి ప్రజాదరణ సన్నగిల్లింది. మాజీ వామపక్ష అధ్యక్షుడు లూలా డసిల్వా కన్నా ఆయన వెనుకబడి వున్నారని ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా తాము పోటీ చేస్తామని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. పేపర్ బ్యాలెట్‌ను ప్రవేశపెట్టాలని గత కొద్ది నెలల నుండి బోల్సనారో పట్టుబడుతున్నారు. కాగా 2014 ఎన్నికల్లో ఎలాంటి అవినీతి, అవకతవకలు చోటు చేసుకోలేదంటూ ఎన్నికల అథారిటీ స్పష్టం చేసింది. బోల్సనారో చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది.