Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్ల యత్నాలు
- తాత్కాలికంగా రాకపోకలు బంద్
కాందహార్: అఫ్ఘనిస్తాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్లు ఆదివారం క్షిపణులతో దాడికి పాల్పడ్డారు. దీంతో అహ్మద్ షా బాబా ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇప్పటికే అఫ్ఘనిస్తాన్‌లో మెజార్టీ భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు కీలకమైన, గతంలో తమకు బలమైన స్థావరంగా ఉన్న కాందహార్‌ను తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాడి విషయాన్ని విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు. ఎయిర్‌పోర్టుపై దాడే లక్ష్యంగా మూడు రాకెట్లు ప్రయోగించారని, వాటిట్లో రెండు రన్‌వేను తాకాయని ఎయిర్‌పోర్టు చీఫ్ మసౌద్ పస్తున్ తెలిపారు. దీంతో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని, రన్‌వే మరమ్మతు పనులు కొనసాగుతున్నాయన్నారు. 24 గంటల్లో విమాన సేవలు పునరుద్ధరించే అవకాశం ఉందన్నారు.
సాయుధులపై వైమానిక దాడులు నిర్వహించేందుకు ఈ ఎయిర్‌పోర్టును వినియోగించుకుంటున్నందున తాము దీన్ని లక్ష్యంగా చేసుకున్నామని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. తాజా పరిస్థితులపై గుల్ అహ్మద్ కమిన్ అనే ఎంపి మాట్లాడుతూ కాందహార్ నగరం తాలిబన్ల అధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే ఈ ప్రాంతంలోని మరో ఆరు రాష్ట్రాలు (ప్రావిన్స్) కూడా వీరి చేతుల్లోకి వెళ్తాయన్నారు. కాందహార్ తాలిబన్ సంస్థకు జన్మస్థలం కావున, వారు ఈ నగరాన్ని తమ తాత్కాలిక రాజధానిగా చేసుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
కాందహార్‌తో పాటు దక్షిణ ప్రాంతంలోని మరో రెండు రాష్ట్రాల రాజధానులైన హెరాత్, లష్కర్ ఘాను సైతం సొంతం చేసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. హెరాత్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలను రద్దు చేసినట్లు స్థానిక మీడియా టోలోన్యూస్ శుక్రవారం వెల్లడించింది. అదేవిధంగా నగరంలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం వద్ద ప్రభుత్వ బలగాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారని తెలిపింది. ఈ నెలాఖరుకు అమెరికా బలగాల ఉపంసహరణ పూర్తి కానున్న నేపథ్యంలో తాలిబన్లు తమ దాడులను ఉధృతం చేశారు.