Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 120 కోట్లమందిపై ప్రభావం : అమెరికా వ్యవసాయ విభాగం నివేదిక
- జాబితాలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్
- ఆదాయంలేక పస్తుల్లో మరో 29 కోట్ల మంది
వాషింగ్టన్ : ప్రపంచ మానవాళి ఆకలి సమస్యల్ని కోవిడ్ సంక్షోభం మరింత పెంచింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆకలితో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఆఫ్రికా, ఆసియాకు చెందిన 76దేశాల్లోని 120కోట్లమందికి తినడానికి తిండి లేదని అమెరికా వ్యవసాయ విభాగం(యూఎస్డీఏ) తాజా నివేదిక అంచనావేసింది. ఆకలి సమస్య పెరిగిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. రోజుకు కనీసం 2100 కాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోకపోతే..ఆ వ్యక్తి ఆకలి సమస్యలో ఉన్నాడని, ఆహార అభద్రతకు లోనవుతున్నాడని అర్థం. ప్రతిఏటా అమెరికా నుంచి ఆహార సాయాన్ని పొందుతున్న 76దేశాల్లో ప్రస్తుతం ఎలా ఉందన్నదానిపై యూఎస్డీఏ అధ్యయనం చేయగా పై విషయాలు తెలిసాయి. ప్రపంచవ్యాప్తంగా మధ్య, తక్కువస్థాయి ఆదాయం గల దేశాలకు ప్రతిఏటా అమెరికా ఆహార సాయాన్ని అందిస్తోంది. ఈ దేశాలకు సంబంధించి 2021 వార్షిక అంచనాలు (ఆహారసాయంపై) లెక్కగట్టగా కోవిడ్ తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని తేలింది. కుటుంబ ఆదాయాలు దెబ్బతిని ఈ ఏడాది 29.1కోట్ల మంది ఆకలి సమస్యలో కూరుకుపోయారని, ఇందులో అత్యధికమంది ఆసియా దేశాల్లోనివారేనని నివేదిక పేర్కొంది.
ఐరాస కూడా అదే చెప్పింది..
తాజా అంచనాల ప్రకారం గత ఏడాదితో పోల్చుకుంటే ప్రపంచంలో ఆహార అభద్రత మరింత విస్తరించినట్టు తెలుస్తోంది. కోవిడ్ తర్వాత ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే సమస్యకు కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఆహార అభద్రతపై ఈ ఏడాది జులైలో ఐక్యరాజ్యసమితి కూడా పలు అంచనాలు రూపొందించింది. ఆహార అభద్రత 15ఏండ్ల గరిష్టస్థాయికి చేరుకుందని, ప్రపంచ జనాభాలో కేవలం 15శాతం మందికి పోషకాహారం అందుబాటులో ఉందని ఐరాస అధ్యయనం నిర్ధారించింది. ఆకలి సమస్య 2021నాటికి మరింత విస్తరిస్తుందని, అధిక ధరలు, సరఫరా వ్యవస్థ దెబ్బతినటం సమస్యను పెంచిందని తెలిపింది. ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడిన పేద దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐరాస భావిస్తోంది.
ఆకలితో ముడిపడిన మానవాళి కష్టాలు మరింత పెరగడానికి అవకాశముంది. తల్లులు, పిల్లల్లో పోషకాహార సమస్య వల్ల మధ్య, తక్కువస్థాయి ఆదాయం గల దేశాలకు భవిష్యత్తులో దాదాపు 30 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని 'నాచుర్ ఫుడ్ జర్నల్' పేర్కొంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కోట్లాదిమంది ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారు. ఇది ఆయా దేశాల్లో రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది.
రెడ్ జోన్లో భారత్
ఆహారసాయాన్ని అందుకుంటున్న 76 దేశాల్లో ఆహార సమస్యను ఎదుర్కొనే జనాభా 31శాతం పెరుగుతోంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఆహార అభద్రతా 72శాతం పెరిగే ఛాన్స్ ఉంది. ఇందులో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, ఇండోనేషియాకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. పోషకాహార సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్యలో పెరుగుదల సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో 21శాతం నమోదైంది. యెమెన్, జింబాబ్వే, కాంగో దేశాల్లో ఆకలి సమస్య ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లో దాదాపు 80శాతం ప్రజలకు తినడానికి తిండి దొరకటం లేదు.
ఎందుకిలా?
ఆకలి సమస్య తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం ఆయా దేశాల్లో కుటుంబాల ఆదాయం పడిపోవటమే. కోవిడ్ సంక్షోభం సమస్యని మరింత పెంచింది. వాతావరణ మార్పులు, అంతర్యుద్ధం, రాజకీయ, ఆర్థిక అస్థిరతలను తాము పరిగణలోకి తీసుకోలేదని యూఎస్డీఏ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు.