Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించుకున్న ఆర్మీ చీఫ్
బ్యాంకాక్ : మయన్మార్ ప్రధానిగా ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ తనకు తాను ప్రకటించుకున్నాడు. కొత్తగా ఏర్పాటుచేసిన 'మయన్మార్ సంరక్షణ ప్రభుత్వం'లో ఆయన ప్రధాని పదవి తీసుకున్నాడని స్థానిక మీడియా తెలిపింది. ఆదివారం నాటి టెలివిజన్ ప్రసంగంలో హ్లెయింగ్ మాట్లాడుతూ 2023 ఆగస్టులో దేశంలో ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మయన్మార్‌కు సంబంధించి ఆగేయాసియా దేశాల కూటమి ఆసియాన్ కూటమి నియమించే ప్రత్యేక రాయబారితో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం ఈ ఏడాది ఫిబ్రవరి 1న పడగొట్టిన విషయం తెలిసిందే. అనంతరం దేశ పాలనా పగ్గాలను చేపట్టిన సరిగ్గా ఆరు నెలల తర్వాత తాజా ప్రకటన రావడం గమనార్హం. సైనిక తిరుగుబాటు అనంతరం ఆర్మీ చీఫ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్(ఎస్ఏసీ) పాలన వ్యవహారాలను చూసింది. తాజాగా దీని స్థానంలో మయన్మార్ సంరక్షక ప్రభుత్వం పేరుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దేశంలో త్వరలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని హ్లెయింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2023 ఆగస్టు నాటికి దేశంలో అత్యవసర పరిస్థితికి ముగింపు పలుకుతామన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం ఆధారంగా ఒక యూనియన్ స్థాపనకు హామీ ఇస్తున్నానని తెలిపారు. తిరుగుబాటు సమయంలో దేశంలో రెండేళ్లలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన సైన్యం, తాజాగా దాన్ని 2023 ఆగస్టు నాటికి వాయిదా వేయడం ద్వారా కాలవ్యవధిని ఆరు నెలలు పొడిగించినట్టు స్థానిక మీడియా పేర్కొంది.