Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ జనాభాలో 2.6 శాతం కరోనా కేసులు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా బుధవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 20 కోట్లు దాటిందని రాయిటర్స్ గణాంకాలు వెల్లడించాయి. పలు దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతుండగా, తక్కువ వ్యాక్సి నేషన్ రేటు, సరైన ఆరోగ్య సదుపాయాలు లేని దేశాలకు ఇది ముప్పుగా ఉంది వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచజ నాభాలో ఇప్పటి వరకు 2.6 శాతం మంది కరోనా బారిన పడ్డారు. అనేక దేశాల్లో పరీక్ష సదుపాయాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొదటి 10 కోట్ల కేసులు నమోదు కావడానికి సంవత్సర కాలం పట్టగా, రెండో 10 కోట్ల కేసులు కేవలం ఆరు నెలల్లోనే నమోదయ్యాయి. అదేవిధంగా కరోనా వైరస్‌తో 44 లక్షల మంది మరణించారని రాయిటర్స్ తన విశ్లేషణలో పేర్కొంది. ఏడు రోజుల సగటున అత్యధిక కేసులను నివేదించే దేశాలైన అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, భారత్, ఇరాన్‌లు రోజువారీగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో 38 శాతం కలిగివున్నాయి. కొత్త కేసుల పెరుగుదల ధనిక, పేద దేశాల మధ్య టీకా రేటులోని అంతరాన్ని హైలెట్ చేస్తోంది. ప్రపంచంలోని దాదాపు మూడో వంతు దేశాల్లో కొత్త కేసులు పెరుగుతుండగా, వాటిల్లో అనేక దేశాలు ఇంకా తమ సగం మంది జనాభాకు కూడా మొదటి డోసు వ్యాక్సిన్ అందించలేదు. ప్రతి దేశంలో 10 శాతం జనాభాకు వ్యాక్సిన్ అందించే వరకు వ్యాక్సిన్ బూస్టర్లపై తాత్కాలిక నిషేధం విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) బుధవారం పిలుపునిచ్చింది. డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గేబ్రెయేసస్ మాట్లాడుతూ ధనిక దేశాలకే అధిక వ్యాక్సిన్లు వెళ్తున్నాయని, మరోవైపు వ్యాక్సిన్ల కొరతతో పేద దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు.