Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యుహెచ్ఓ వెల్లడి
ఐక్యరాజ్య సమితి : చాలా వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ ప్రస్తుతం 135దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వచ్చే వారానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 20 కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా 132 దేశాల్లో బీటా వేరియంట్, 81 దేశాల్లో గామా వేరియంట్, 182 దేశాల్లో అల్ఫా వేరియంట్ కేసులు నమోదైనట్లు డబ్ల్యుహెచ్ఓ వారాంతపు నివేదిక తెలిపింది. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే 40లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోల్చితే కేసుల పెరుగుదలలో వేగం ఎక్కువగా ఉంది. తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతంలో 37 శాతం, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో 33శాతం, ఆగేయాసియాలో తొమ్మిది శాతం కేసులు పెరిగాయి. అయితే మరణాల విషయానికొస్తే అంతకుముందు వారంతో పోల్చితే గత వారం ఎనిమిది శాతం మేర తగ్గింది. కొత్త మరణాల్లో పశ్చిమ పసిఫిక్, తూర్పు మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 19.7కోట్ల కేసులు, 42లక్షల మరణాలు నమోదయ్యాయి. దేశాలవారీగా చూసినట్లైతే, గతవారంలో కొత్త కేసులు అమెరికా (5,43,420 కొత్త కేసులు, 9శాతం పెరుగుదల), భారత్ (2,83,923 కొత్త కేసులు, 7శాతం పెరుగుదల), ఇండోనేషియా (2,73,891 కొత్త కేసులు, 5శాతం పెరుగుదల), బ్రెజిల్ (2,47,830 కొత్త కేసులు, 24శాతం పెరుగుదల), ఇరాన్ (2,06,722 కొత్త కేసులు, 27శాతం పెరుగుదల)గా వున్నాయి