Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్, ఆర్థిక పరిస్థితుల నిర్వహణలో ప్రభుత్వం విఫలం..
- ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హౌరెత్తాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిర్వహించడంతో పాటు ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ వేలాది మంది ఆందోళనలు నిర్వహిస్తున్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ భారీ నిరసనలతో హౌరెత్తింది. విక్టరీ మాన్యుమెంట్ సమీపంలోని రహదారుల్లో వేలాది మంది ర్యాలీగా వెళ్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ క్రమంలో నిరసనకారులపై జల ఫిరంగులు, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను అధికార యంత్రాంగం ప్రయోగించింది. దీంతో మరింతగా ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ప్రధాన మంత్రి ప్రయుత్ చాన్‌వోచా కార్యాలయం వైపు సాగిన ఈ నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఆందోళనకారులను నియంత్రించడం కోసమే టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి క్రిసానా పట్టనాచరోయెన్ మీడియాతో అన్నారు. నిరసనకారులు నాటుబాంబులు, రాళ్లు, గోళీలు విసరడంతో ఘర్షణలకు దారితీశాయని పేర్కొన్నారు. కాగా, డజన్ల కొద్ది నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని మోటర్ సైకిళ్లు, అంబులెన్స్‌లలో తీసుకెళ్లడం కనిపించింది. సాధారణ పౌరులతో పాటు పలువురు అధికారులు సైతం ఈ ఘర్షణల్లో గాయపడినట్టు ఎరవాన్ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ ప్రకటించింది. ప్రజలకు వ్యాక్సిన్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందనీ, అందుకే పీఎం రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని నిరసనకారుల్లో ఒకరు తెలిపారు. ''ఉద్యోగాలు లేవు, ఆదాయమూ లేదు. ప్రభుత్వ సాయమూ లేదు. మాకు నిరసన మార్గం ఒక్కటే మిగిలింది'' అని మరో ఆందోళనకారుడు పేర్కొన్నాడు. థాయిలాండ్‌లో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. నైట్ కర్ఫ్యూతో పాటు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలోని 6 శాతం మందికి మాత్రమే టీకాలు అందించారు.