Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు అడుగుల నీటిలో 12 నగరాలు
- మైదానప్రాంతాల్లోనూ విధ్వంసం
- మంచుపర్వతాలు కరగటంతో పొంచి ఉన్న ముప్పు : నాసా రిపోర్టు
పచ్చని చెట్లు...జంతుజాలం.. పర్యావరణం పచ్చగా ఉంటే మానవమనుగడకు ఎలాంటి ఇబ్బందిఉండదు. కానీ పెరుగుతున్న జనాభాకు తోడు మౌలికఅవసరాలు అధికమవ్వటంతో ప్రకృతి నాశనమవుతున్నది. దానివల్లే భూమి ఉష్ణోగ్రతల్లో మార్పులు చెందుతున్నాయి. భూమిని కప్పి ఉండే మంచుఖండాలు కరిగిపోతున్నాయి. నానాటికీ పెరుగుతున్న వేడి కారణంగా మంచు కరుగుతున్నది. ఇవి సముద్రంలో కలవటంతో ప్రళయం రాబోతున్నదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా హిమానీనదం కరగటంతో భారత్లోని 12 నగరాలు 3 అడుగుల వరకు నీటిలో మునిగిపోతాయనీ, మైదానాల్లో కూడా విధ్వంసం జరగనున్నదని నాసా రిపోర్టులో ఆందోళనవ్యక్తం చేసింది.
12 నగరాలివే..
ఓఖా, మోర్ముగావ్, కండ్ల, భావ్నగర్, ముంబయి, మంగళూరు, చెన్నై, విశాఖపట్నం, టుటికోరన్, కొచ్చి, పారాదీప్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ప్రభావం. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు భవిష్యత్తులో ఇక్కడనుంచి ఖాళీ చేసి, వేరే స్థలాలకు వలసవెళ్లకతప్పదని నాసా పేర్కొన్నది.
సముద్ర మట్ట ప్రొజెక్షన్ సాధనాన్ని సృష్టించిన నాసా
సముద్ర మట్ట ప్రొజెక్షన్ సాధనాన్ని నాసా రూపొందించింది. ఇది ప్రజలను సకాలంలో తరలించడానికీ, బీచ్లలో విపత్తుల సమయంలో సహాయ చర్యల ఏర్పాటుకు తోడ్పడనున్నది. ఈ ఆన్లైన్ సాధనం ద్వారా.. భవిష్యత్తులో సంభవించే విపత్తు అంటే సముద్ర మట్టం పెరగడాన్ని తెలుసుకోవచ్చు.
ఐపీసీసీ నివేదికను ఉటంకిస్తూ హెచ్చరిక
వాతావరణ మార్పుపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) నివేదికను ఉదహరిస్తూ, అనేక నగరాలు మునిగిపోతాయని నాసా హెచ్చరించింది. ఇది ఐపీసీసీ విడుదల చేసిన ఆరో అంచనా నివేదిక తాజాగా విడుదలైంది.ఈ నివేదిక వాతావరణ వ్యవస్థ, వాతావరణ మార్పుల గురించి మెరుగైన వీక్షణను అందిస్తున్నది.
1988 నుంచి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను ఐపీసీసీ అంచనా వేస్తున్నది. ఈ ప్యానెల్ ప్రతి ఐదు నుంచి ఏడేండ్లకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్థితిని నివేదిస్తుంది. ఈసారి నివేదికను పరిశీలిస్తే ముప్పు పొంచి ఉన్నదని సూచిస్తున్నది.
సముద్రంతో పాటు మైదానాల్లో విధ్వంసం
2100 సంవత్సరం నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతున్నదని నివేదిక పేర్కొంది. ప్రజలు భయంకరమైన వేడిని భరించాల్సి ఉంటుంది. కర్బన ఉద్గారాలు మరియు కాలుష్యాన్ని ఆపకపోతే, ఉష్ణోగ్రత సగటున 4.4 సెంటీగ్రేడ్ చొప్పున అధికం కానున్నది. రాబోయే రెండు దశాబ్దాల్లో ఉష్ణోగ్రత 1.5 సెంటీగ్రేడ్ చొప్పున పెరగనున్నది. వాతావరణంలో ఇంత వేగంగా మార్పులు సంభవిస్తే.. హిమానీనదాలు కూడా కరుగుతాయి. ఆ విధంగా ప్రళయంలా ముంచుకొచ్చే నీరు మైదానాలు, సముద్ర ప్రాంతాలలో విధ్వంసం తేనున్నది.
తగ్గుతున్న అనేక దేశాల విస్తీర్ణం
నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ సీ లెవల్ ప్రొజెక్షన్ టూల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులకు శాస్త్రవేత్తలకు హెచ్చరిక చేశారు. వచ్చే శతాబ్దం నాటికి మన దేశాలలో చాలా వరకు భూమిని కోల్పోనున్నదని తెలిపారు. సముద్ర మట్టం చాలా వేగంగా పెరుగుతున్నది, దానిని నిర్వహించడం కష్టమవుతున్నది. దీనికి ఉదాహరణలెన్నో.. అనేక ద్వీపాలు మునిగిపోయాయి. అనేక ఇతర ద్వీపాలను సముద్రం మింగేస్తుంది.
పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్
భారతదేశంతో సహా ఆసియా ఖండంలో కూడా తీవ్ర ప్రభావాలను చూడవచ్చు. హిమాలయ ప్రాంతంలో హిమానీనదం ఏర్పడిన సరస్సులు తరచుగా తెగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలు వరదలతో పాటు అనేక ప్రకృతివైపరీత్యాలను ఎదుర్కొవాల్సి వస్తున్నది. రాబోయే కొన్ని దశాబ్దాలలో దేశంలో వార్షిక సగటు వర్షపాతం పెరుగుతున్నది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల్లో ప్రతి ఏటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఉష్ణోగ్రతలో వేగంగా పెరుగుదల
మానవ జోక్యం కారణంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిన విధానం, మార్పులు భూమిపై వేగంగా జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత 2000 సంవత్సరాలలో సంభవించిన మార్పులు ప్రమాదకరంగా మారుతున్నాయి. 1750 నుంచి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు వేగంగా పెరిగాయి. 2019 లో పర్యావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి ఎన్నడూ లేనంతగా నమోదైంది.
మీథేన్ , నైట్రస్ ఆక్సైడ్ వంటి ఇతర గ్రీన్హౌస్ వాయువులు 2019లో పెరిగాయి. భూమి వేడెక్కడం రేటు 1970ల నుంచి వేగంగా పెరిగింది. గత 50 సంవత్సరాలలో ఎన్నడూలేనంతగా ఉష్ణోగ్రతల్లో మార్పు జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రకృతి వినాశనాన్ని ఆపకపోతే.. ప్రళయాలు మరెన్నో రూపాల్లో విరుచుకుపడతాయని నాసా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.