Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా : చైనా జాతీయ రహస్యాలను దొంగిలించేందుకు యత్నించారన్న కేసులో కెనడా పౌరుడు మైఖేల్ స్పావొర్ను చైనా కోర్టు దోషిగా నిర్ధారించి 11ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనను దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది. ఈశాన్య చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోని దాండంగ్ కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 50వేల యువాన్ల విలువైన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. జాతీయ రహస్యాలకు సంబంధించినది కావడంతో మార్చి 19న ఈ కేసు విచారణ గోప్యంగా సాగింది. మార్చి 22న కెనడా మాజీ దౌత్యవేత్త మైఖేల్ కోవ్రిగ్ విచారణను బీజింగ్ కోర్టు చేపట్టింది. గతేడాది జూన్‌లో చైనా జాతీయ భద్రతకు విఘాతం కలిగించే నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై చైనా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం మైఖేల్ కోవ్రిగ్, మైఖేల్ స్పావొర్లను ప్రాసిక్యూట్ చేసింది. చైనాలో ప్రవేశించడానికి కోవ్రిగ్ సాధారణ పాస్‌పోర్ట్‌ను, బిజినెస్ వీసాను ఉపయోగించారని ఆయనపై అభియోగం నమోదైంది. 2017 నుండి చైనాలో తనకున్న సంబంధాల ద్వారా సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు కోవ్రిగ్ చైనా వచ్చాడు. కోవ్రిగ్కు కీలకమైన సాయాన్ని స్పావొర్ అందించాడని ఆరోపించబడింది.
డ్రగ్ స్మగ్లర్ రాబర్ట్ లాయిడ్‌కు ఉరి శిక్ష
కెనడియన్ డ్రగ్ స్మగ్లర్ రాబర్ట్ లాయిడ్ షెలెన్బర్గ్కు దిగువ స్థాయి చైనా కోర్టు విధించిన ఉరి శిక్షను లియానింగ్ ప్రావిన్స్ ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 2018 నవంబరులో డాలియాన్ కోర్టులో జరిగిన మొదటి విచారణలో రాబర్ట్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే, రాబర్ట్ డ్రగ్స్ అక్రమ రవాణా ఊహించినదానికన్నా చాలా లోతుగా, విస్తృతంగా ఉన్నట్లు మరి కొన్ని ఆధారాలు లభించడంతో 2019 జనవరిలో ఆ కేసును పునర్విచారణకు చేపట్టిన డాలియాన్ కోర్టు నేరం తీవ్రత దృష్ట్యా జైలు శిక్షను ఉరి శిక్షగా మార్చుతూ తీర్పునిచ్చింది. డాలియాన్ కోర్టు మొదట ఇచ్చిన తీర్పునే ఖాయం చేయాలంటూ రాబర్ట్ లియానింగ్ హైకోర్టుకు అప్పీలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఆయనకు ఉరి శిక్షే సరైనదని తీర్పు చెప్పింది.