Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయిదు రోజుల్లో 9 రాష్ట్ర రాజధానులు కైవసం
- 90 రోజుల్లో కాబూల్ కూడా
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌తో ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్లతో ఆఫ్ఘన్‌కు గల సరిహద్దులన్నిటినీ తాలిబాన్లు పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. గత అయిదు రోజుల్లో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని తొమ్మిది రాష్ట్రాల రాజధానులను వశపరచుకున్న తాలిబాన్లు బుధవారం మరో మూడు రాష్ట్రాల రాజధానులపై గురిపెట్టారు. గత శుక్రవారం నుంచి ఇప్పటివరకు వారు స్వాధీనపరచుకున్న తొమ్మిది రాష్ట్ర రాజధానుల్లో ఫైజాబాద్, ఫరా, పుల్-ఇ-ఖుమ్రీ, సార్-ఎ-పుల్, షెబర్ఘన్, అయిబక్, కుందుజ్, తలూఖాన్, జరాన్జ్ ఉన్నాయి. 3.8 కోట్ల జనాభా కలిగిన ఆఫ్ఘనిస్తాన్‌లో మొత్తం 34 రాష్ట్రాలు, 421 జిల్లాలు ఉన్నాయి. ఇరవై ఏళ్లుగా తిష్టవేసిన అమెరికా దళాలు అనుకున్న దానికన్నా ముందే రాత్రికి రాత్రి గుడారాలు ఎత్తేసి విమానాల్లో ఉడాయించిన మే నెల నుంచే తాలిబాన్ల విస్తరణ మొదలైంది. మొదట గ్రామీణ ప్రాంతాలపై ఎక్కుపెట్టిన తాలిబాన్లు, తరువాత రాష్ట్రాల రాజధానుల ముట్టడి చేపట్టారు. ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్‌తో గల కీలక సరిహద్దులను తాలిబాన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్న విషయాన్ని రక్షణ మంత్రి సెర్గి షోయుగు ధ్రువీకరించారు. సరిహద్దులు దాటి పొరుగు దేశాలపై దాడులు చేయబోమని తాలిబాన్లు తమకు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌కు పశ్చిమాన తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తూర్పున పాకిస్తాన్, ఈశాన్యాన చైనా, దక్షిణాన ఇరాన్ ఉన్నాయి. తాలిబాన్ల దూకుడు ఇదే విధంగా కొనసాగితే 90 రోజుల్లో దేశ రాజధాని కాబూల్ కూడా వారి వశమవుతుందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. రోజకు రెండు మూడు రాష్ట్రాల రాజధానులను ఆక్రమించుకుంటూ తాలిబన్లు ముందుకు సాగుతున్నట్లు వస్తున్న వార్తలపై బైడెన్ స్పందిస్తూ, ఆఫ్ఘన్ నుంచి అమెరికన్ బలగాల ఉపసంహరణ నిర్ణయం పట్ల తానేమీ విచారం చెందడం లేదని అన్నారు. ఆఫ్ఘన్లందరూ ఏక తాటిపైకి రావాలని కోరారు.
ఆఫ్ఘన్ తాత్కాలిక ఆర్థిక మంత్రి రాజీనామా
ఆఫ్ఘన్ తాత్కాలిక ఆర్థిక మంత్రి ఖలీద్ పయేందా బుధవారం తన పదవికి రాజీనామా చేసి, దేశం వీడి పారిపోయారు. కీలకమైన కస్టమ్స్ కేంద్రాలను తాలిబాన్లు చేజిక్కించుకోవడంతో ప్రభుత్వానికి రెవిన్యూ బాగా పడిపోవడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకుని ఉడాయించినట్లు బ్లూమ్ బర్గ్ మీడియా నెట్వర్కు తెలిపింది