Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28మంది సైనికులతో సహా 65మంది దుర్మరణం
అల్జీర్స్ : ఉత్తర అల్జీరియాలోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన దావానలంలో 65మంది మరణించారని ప్రభుత్వ టెలివిజన్ బుధవారం తెలిపింది. ఇంకా అడవుల్లో కార్చిచ్చు కొనసాగుతూనే వుంది. అగ్ని కీలలను అదుపుచేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. పర్వతాలతో నిండిన కబైలి ప్రాంతంలో చాలా భాగం కాలిబూడిదైంది. మరణించిన వారిలో 28మంది సైనికులు కూడా వున్నారని ప్రభుత్వం తెలిపింది. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారికి సంతాపంగా మూడు రోజుల జాతీయ సంతాప దినాలను అధ్యక్షుడు అబ్దుల్మజిద్ టెబూన్ ప్రకటించారు. ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేశారు. దావానలంతో గత వారం రోజులుగా అల్జీరియా, టర్కీ, గ్రీస్ అడవుల్లో చాలా భాగం దహించుకుపోయాయి. ప్రస్తుత పరిస్థితికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండడంతో మధ్యధరా సముద్ర ప్రాంతం దావానలానికి కేంద్రంగా మారిందని యురోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణా సంస్థ పేర్కొంది. సోమ, మంగళ వారాల్లో ఉత్తర అల్జీరియాలోని అటవీ ప్రాంతాల్లో 12చోట్ల విడివిడిగా అగ్ని కీలలు చెలరేగాయి. కొంతమంది దుండగులు ఈ మంటలు పెచ్చరిల్లడానికి దోహదపడుతున్నారని హౌం మంత్రి కామెల్ బెల్జోద్ ఆరోపించారు. బాధిత ప్రాంతాల్లోని ప్రజలు సమీప సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు.