Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మంది మృతి
బీరట్ : లెబనాన్ ఉత్తర ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కర్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన టిలీల్ వద్ద ఒక ఆయిల్ ట్యాంకర్ ట్రక్కు పేలిన ఘటనలో 20 మంది మరణించగా, డజన్ల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయని లెబనీస్ రెడ్‌క్రాస్ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొంది. ఘటనాస్థలి నుంచి 20 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, కాలిన గాయాలైన 79 మందిని చికిత్స కోసం ఉత్తర లెబనాన్‌తో పాటు రాజధాని బీరట్‌లోని ఆసుపత్రులకు తరలించామని తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామని, చికిత్సకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి హమద్ హసన్ పేర్కొన్నారు. గాయాలపాలైన వారి కోసం రక్తదానం చేయాలని ఉత్తర లెబనాన్‌లోని ఆసుపత్రులు ప్రజలకు పిలుపునిచ్చాయి. అదేవిధంగా ఆసక్తి ఉన్నవారు రక్తదానానికి సంప్రదించేందుకు స్థానిక టివి ఛానెళ్లు సంబంధిత ఫొన్ నంబర్లను ప్రసారం చేశాయి. లెబనాన్ తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం. మరోవైపు ఇంధనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. పేలుడు ఘటన జరిగిన టిలీల్ గ్రామం సిరియా సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. లెబనాన్‌తో పోల్చుకుంటే సిరియాలో ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మగ్లింగ్ రూపంలో ఈ ఆయిల్ ట్యాంకు సిరియాకు వెళ్తోందా? అనేదానిపై ఇంకా స్పష్టతకు రాలేదు. అక్కర్ ఘటన గతేడాది చోటుచేసుకున్న బీరట్ పోర్టు ప్రమాదానికి భిన్నమైనది కాదని మాజీ ప్రధాని సాద్ అల్-హరిరి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు, తాజా ఘటనకు బాధ్యత వహిస్తూ అధ్యక్షుడితో సహా సంబంధిత అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.