Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంకీర్ణ కూటమిలో అంతర్గత పోరుతో
- మెజార్టీ కోల్పోయిన ముహిద్దీన్
కౌలాలాంపూర్ : పాలక సంకీర్ణ కూటమిలో అంతర్గత పోరు కారణంగా మెజార్టీ కోల్పోయిన మలేషియా ప్రధాని ముహిద్దీన్ సోమవారం రాజీనామా చేసే అవకాశం ఉందని స్థానిక న్యూస్‌పోర్టల్ మలేషియాకిని ఆదివారం పేర్కొంది. ముహిద్దీన్ తన రాజీనామాపత్రాన్ని సోమవారం రాజు అల్-సుల్తాన్ అబ్దుల్లాకు సమర్పించాలని భావిస్తున్నారని మంత్రి మహ్మద్ రెడ్జువాన్ యూసఫ్ పేర్కొన్నారని వెల్లడించింది. మలేషియాకినితో మంత్రి మాట్లాడుతూ తన రాజీనామా నిర్ణయాన్ని ముహిద్దీన్ పార్టీ సభ్యులకు చెప్పారని, ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. '' రేపు కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమౌతుంది. దీని తర్వాత ప్రధాని నేరుగా ప్యాలెస్‌కు చేరుకొని రాజుకు రాజీనామా పత్రం సమర్పిస్తారు'' అని చెప్పారు. అయితే దీనిపై వివరణ తెలుసుకునేందుకు రాయిటర్స్ మీడియా సంస్థ ప్రయత్నించగా, సదరు మంత్రి అందుబాటులో లేరు. మరోవైపు రాజీనామా వార్తలపై ప్రధాన మంత్రి కార్యాలయం కూడా స్పందించలేదు.
17 నెలల పాటు పాలన చేసిన ముహిద్దీన్ రాజీనామా చేస్తేగనుక, ఇప్పటికే కోవిడ్-19 సంక్షోభం, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న మలేషియాలో మరింత అనిశ్చిత పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్లమెంట్లో ఏ పక్షానికి కూడా స్పష్టమైన మెజార్టీ లేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై దేశ రాజు అబ్దుల్లా నిర్ణయం తీసుకుంటారు. ముహిద్దీన్ గతేడాది మార్చిలో స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి అధికారంపై ఆయన పట్టు అస్థిరంగానే ఉంది. సంకీర్ణ పాలక పక్షంలో పెద్ద పార్టీగా ఉన్న యుఎంఎన్ఓకు చెందిన పలువురు సభ్యులు ప్రభుత్వానికి ఇటీవల మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధానిపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తోసిపుచ్చుతూ వచ్చిన ప్రధాని, సెప్టెంబర్‌లో తన మెజార్టీని నిరూపించుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ, శుక్రవారం ముహిద్దీన్ మొదటిసారి తనకు మెజార్టీ లేదని ఒప్పుకున్నారు.