Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోర్టుఅవు-ప్రిన్స్ : భారీ భూకంపంతో కరేబియన్ దేశం హైతీ మృత్యుదిబ్బగా మారింది. దేశ నైరుతి ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ఘోర విషాదంలో ఇప్పటి వరకు 304 మంది మరణించగా, వందలాది మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆదివారం తెలిపారు. భూకంపం ధాటికి అనేక భవనాలు, చర్చిలు, హోటళ్లు, పాఠశాలలు, ఇళ్లు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భూకంప ప్రభావిత ప్రాంతంపై ప్రధాని హెన్రీ ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు నెలపాటు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఈశాన్య హైతీ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం తర్వాత వరుస ప్రకంపనలు సంభవించాయి. రాజధాని పోర్టుఅవు-ప్రిన్స్‌కు 150 కిలోమీటర్ల దూరంలో, పెటిట్ ట్రౌడి నిప్పెస్ పట్టణానికి 8 కిలోమీటర్ల సమీపాన 10 కిలోమీటర్ల భూగర్భంలో ఈ భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే(యుఎస్‌జిఎస్) పేర్కొంది. 11 ఏళ్ల క్రితం 2010లో హైతీలో రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో వేలాది సంఖ్యలో ప్రజలు మరణించగా, అంతకంటే ఎక్కువ మందికి గాయాలయ్యాయి. పోర్టుఅవు-ప్రిన్స్‌కు చాలా దూరంలో భూకంపం కేంద్రం ఉండడంతో రాజధాని నగరంపై పెద్దగా ప్రభావం పడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
భూకంప విషాదంలో ఇప్పటి వరకు ప్రాథమికంగా 304 మంది మరణించారని, దాదాపు 1,800 మందికి పైగా గాయపడ్డారని 'హైతీ సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్' పేర్కొంది. ఎక్కువ మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సహాయక కార్యక్రమాల్లో అత్యవసర బృందాలతో పాటు సాధారణ పౌరులు కూడా పాల్గొంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో పలువురిని ఇప్పటికే రక్షించారు. భూకంప ప్రభావంతో 949 ఇళ్లు, ఏడు చర్చిలు, రెండు హోటళ్లు, మూడు పాఠశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరో 723 ఇళ్లు, ఒక జైలు, మూడు ఆరోగ్య కేంద్రాలు, ఏడు పాఠశాలలు దెబ్బతిన్నాయని హైతీ సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ వెల్లడించింది. పోర్టు, ఎయిర్‌పోర్టు, టెలికాం మౌలిక సదుపాయాలకు పెద్దగా నష్టం జరగలేదని తెలిపింది.