Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాలిబన్లను కోరిన ఐరాస చీఫ్
న్యూయార్క్ : తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఆఫ్ఘన్ల హక్కులను కాపాడాల్సిందిగా ప్రధాన కార్యదర్శి గుటెరస్ తాలిబన్లను కోరారు. ''భారమైన హృదయంతో ఆఫ్ఘన్లోని పరిణామాలను యావత్ ప్రపంచం వీక్షిస్తోంది. మున్ముందు ఏం జరగబోతోంది అన్న ఆవేదన అందరిలో వుంది' అని వ్యాఖ్యానించారు. భారత్ అధ్యక్షతన ఆఫ్ఘనిస్తాన్పై భద్రతా మండలి జరిపిన రెండో సమావేశం ఇది. వారం రోజుల వ్యవధిలోనే మండలి రెండోసారి సమావేశమైంది. ఆగస్టు మాసానికి భద్రతా మండలికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో చోటు చేసుకున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వివరించారు.ఆఫ్ఘన్ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అన్ని పక్షాలపై వుందని అన్నారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిరక్షిస్తూ, గౌరవిస్తూ తాలిబన్లు, ఇతర అన్ని పక్షాలు వ్యవహరించాలన్నారు. ఆఫ్ఘన్లో తాజా పరిణామాలతో అక్కడి మహిళలు, బాలికల భవితవ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులు, వారి స్వేచ్ఛ పరిరక్షించబడాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మద్దతు, సాయం కోసం ఆఫ్ఘన్లు, అంతర్జాతీయ సమాజం వైపు చూస్తున్నారని అన్నారు. ఆఫ్ఘన్ల అవకాశాలు విస్తరించాలని, వారి చదువుకు హామీ కల్పించాలని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వ్యాప్తి చెందాలని, హక్కులకు రక్షణ కల్పించాలని గుటెరస్ కోరారు. భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజం కలిసి కట్టుగా వుండాలని, చర్యలు తీసుకోవాలని తమ అధీనంలో వున్న అన్ని వనరులను, సాధనాలను ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాద ముప్పును అణచివేయాలని కోరారు.