Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : కుండపోతగా కురుస్తున్న వర్షాలతో టర్కీలోని వాయవ్య ప్రాంత బ్లాక్ సీ ప్రావిన్స్‌లు కకావికలమ య్యాయి. తీవ్ర స్థాయిలో వరదలు సంభవించి ఇళ్ళు, భవనాలు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ప్రవాహ ధాటికి కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు జల దిగ్బంధనలో మునిగాయి. ఇప్పటివరకు కస్తమోను ప్రావిన్స్‌లో 60మంది, సినోప్‌లో 9మంది, బార్టిన్‌లో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. తీవ్రంగా వచ్చిన వరదలతో ఉత్తర టర్కీలోని ఒక పట్టణం మొత్తంగా నాశనమైందని అధికారులు చెప్పారు. కాగా మరో 47మంది ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సహాయ, పునరావాస కార్యకలాపాల్లో దాదాపు 8వేల మంది సిబ్బంది, 20జాగిలాలు పాల్గొంటున్నాయి. ఈ ప్రాంతంలో వరదల నుంచి దాదాపు 2500మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో చాలా మందిని హెలికాప్టర్లలో తీసుకువెళ్ళారు. దాదాపు 40గ్రామాలు అంథకారంలో మగ్గుతున్నాయి. మధ్యధరా సముద్ర తీర ప్రాంత దేశమైన టర్కీలో ఒకవైపు వడగాలులు, మరోవైపు కార్చిచ్చుతో జనం అలమటిస్తున్నారు. ఇప్పటివరకు వేడి గాలులతో తాళలేకపోయిన ప్రజలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇదంతా వాతావరణ మార్పుల ప్రభావం తప్ప మరొకటి కాదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.