Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో కొత్త ప్రభుత్వ తీరుతెన్నులు
- ప్రకటించిన తాలిబన్
- కాబూల్ విమానాశ్రయంలో గందరగోళం
- విమాన చక్రాల నుంచి పడిపోయి ఇద్దరు మృతి
- ఆఫ్ఘన్లో అమెరికా ఓటమిని ఎత్తిచూపిన చైనా మీడియా
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిం దని తాలిబన్ ప్రకటించింది. కాబూల్‌లోని అధ్యక్ష భవన కార్యాలయాన్ని స్వాధీనపరుచుకున్న అనంతరం తాలిబన్లు సోమవారం యుద్ధం ముగిసినట్టు ప్రకటిం చారు. కాగా తమ పౌరులను, సిబ్బందిని అక్కడనుంచి ఖాళీ చేయిం చేందుకు పశ్చిమ దేశాలు సోమవారం తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇస్లామిస్ట్ తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశించిన వెంటనే ఆదివారమే అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. రక్తపాతాన్ని నివారించాల న్నదే తన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. కాగా మరోవైపు వందలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. తాలిబన్ ప్రతినిధి మహ్మద్ నయీమ్ అల్ జజీరా టివితో మాట్లాడుతూ, 'ఈ రోజు ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్లకు మహత్తరమై దినం. గత 20 ఏండ్లుగా వారు చేసిన త్యాగాలకు అందిన ఫలితాలను, ప్రయోజనాలను ఈనాడు వారు చూస్తు న్నారు' అని వ్యాఖ్యానించారు. మెరుపు వేగంతో దాడులు చేస్తూ దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి తాలిబన్లకు కేవలం వారంరోజులు పట్టింది. కోట్లాది డాలర్ల వ్యయంతో ఏండ్లతరబడి అమెరికా, ఇతరులు సమకూర్చిన ఆయు ధాలు, శిక్షణ అంతా నిరుపయోగంగా కొట్టుకుపో యింది. అధ్యక్ష భవనంలో తాలిబన్ కమాండర్లు, డజన్ల సంఖ్యలో ఫైటర్లు వున్న ఫటేజిని అల్ జజీరా టీవీ ప్రసారం చేసింది. త్వరలోనే కొత్త ప్రభుత్వం తీరు తెన్నులు వెల్లడిస్తామని నయీమ్ చెప్పారు. ఒంటరిగా, ఏకాకిగా జీవించాలని తాలిబన్ కోరుకోవడం లేదని, శాంతియుత అంతర్జాతీయ సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు.
మాకు షరతులు ఎలా విధిస్తారు?
తెల్లవారు జామున చీకట్లలో వందలాదిమంది ఆఫ్ఘన్లు సామాన్లను మోసుకుంటూ విమానాశ్రయం రన్‌వేలపై పరుగులు పెట్టడం కనిపించింది. ఏదో ఒక విమానాన్ని పట్టుకుని అందులో స్థానం సంపాదించి దేశాన్ని వదిలివెళ్ళిపోవాలనే తహ తహ వారిలో కనిపిస్తోంది. ఈలోగా మొత్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వారు విమానాశ్రయాన్ని ఎలా అదుపులోకి తీసుకుంటారు? ఆఫ్ఘన్లకు షరతులు ఎలా విధిస్తారు? అని మానవ హక్కుల కార్యకర్త రక్సందా జిలాలి ప్రశ్నించారు. ఇది మా విమానాశ్రయం కానీ ఇక్కడ మేం పూర్తి అనిశ్చితిలో మునిగిపోయి వున్నాం. దౌత్యవేత్తలను మాత్రం వేగంగా తరలిస్తున్నారని జిలాలీ పేర్కొన్నారు.
వారిని వెళ్లనివ్వండి : 60కి పైగా దేశాల ప్రకటన
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్‌లతో సహా 60కి పైగా దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దేశం విడిచి వెళ్ళాలనుకుంటున్న ఆఫ్ఘన్‌లందరినీ, అంతర్జాతీయ పౌరులను వెళ్ళేందుకు అనుమతించాలని ఆ దేశాలు కోరాయి. వారు ఇక్కడ నుండి వెళ్ళిపోయి సురక్షితంగా జీవించాలనుకుంటున్నారు. అంతర్జాతీయ సమాజంగా మనం వారికి సహకరించాలని ఆ ప్రకటన కోరింది.
5గురు మృతి
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో సోమవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు రాజధానిని స్వాధీనపరుచుకున్న గంటల వ్యవధిలోనే వందలాదిమంది ప్రజలు భయాందోళనలతో విమానాలు ఎక్కి దేశం విడిచివెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితి బీభత్సంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో ఐదుగురు మరణించినట్టు వార్తలందాయి. కాబూల్ నుంచి తమ దౌత్యవేత్తలను, ఎంబసీ సిబ్బందిని తీసుకెళ్ళేందుకు వచ్చిన అమెరికా సైనిక విమానంలోకి ప్రజలు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డగించేందుకు బలగాలు కాల్పులను జరిపాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. విమానాశ్రయం ప్రవేశ ద్వారానికి పక్కగా మూడు మృతదేహాలు నేలపై పడి వున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ఐదు మృతదేహాలను చూశానని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. రన్‌వేపై ఆగిన అమెరికా రవాణా విమానంలోకి ఎక్కేందుకు ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు ఒక మీడియా సంస్థ వెలువరించిన వీడియో వెల్లడించింది.
హృదయ విదారక ఘటన..
ఆఫ్గానిస్తాన్‌లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశం తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిపోవడంతో ప్రజలు తమ ప్రాణాలను అరి చేతుల్లో పెట్టుకుని బతుకున్నారు. ఎప్పుడు ఎటు నుంచి ఏ విపత్తు ముంచెత్తుకొస్తుందో తెలియని ఆందోళనల్లో ఉన్నారు. దీంతో దేశం నుంచి పారిపోయేందుకు ప్రజలు విమానాశ్రయాలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. విమానాలు కూడా అధిక సంఖ్యలో లేకపోవడంతో .. తదుపరి సర్వీసు కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో హదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆఫ్గాన్ నుంచి పారిపోయిందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు విమానంలో ఖాళీ లేక..మరో అవకాశం లేకే విమానం చక్రాలకు తమను తాము కట్టుకున్నారు. కాబూల్ నుంచి విమానం ఒక్కసారిగా గగనతలంలోకి ఎగరగానే...వీరిద్దరూ ఒక్కసారిగా నేలపై పడిపోవడం వీడియోలో కన్పిస్తుంది. త్రెహన్ టైమ్స్ షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు చక్రాల నుండి పడిపోవడం కనిపిస్తుంది. కాగా, వీరిద్దరూ చనిపోయినట్టు సమాచారం.
పరిస్థితులను చక్కదిద్దలేకపోయింది : చైనా మీడియా
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఘోరంగా, అవమానకరమైన రీతిలో విఫలమైందని, తీవ్ర అసమర్ధతను ప్రదర్శించిందని చైనా మీడియా అక్కడ పరిస్థితులను చక్కదిద్దలేక హడావిడిగా బలగాలను ఉపసంహరించిందని, దాంతో తాలిబన్లు వెంటనే దేశాన్ని స్వాధీనపరుచుకోగలిగారని పేర్కొంది. అమెరికా తన బలగాను వేగంగా ఉపసంహరించిన తీరు, తాలిబన్లకు గతంలో తీవ్రవాద గ్రూపులతో వున్న సంబంధాల పట్ల చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చైనాలోని పశ్చిమ జిన్జియాంగ్ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దును కలిగివుంది. ఈ నేపథ్యంలో చైనా, ఆ ప్రాంత భద్రత పట్ల ఆందోళనలు వున్నాయి. అయితే చైనా ప్రభుత్వ మీడియా అమెరికా ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎత్తిచూపింది. తీవ్రవాదంపై పోరు పేరుతో ఆఫ్ఘన్‌లోకి ప్రవేశించిన భద్రతా బలగాలుల రెండు దశాబ్దాల తర్వాత ఏమీ సాధించకుండానే నిష్క్రమించాయని చైనా అధికార దినపతిక్ర వ్యాఖ్యానించింది. అమెరికా ఏర్పరచిన శూన్యాన్ని భర్తీ చేయాలని చైనా అనుకోవడం లేదని స్పష్టం చేసింది.