Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్ పట్టణంలో ఆ దేశ జాతీయ జెండాను తొలగించి, తాలిబన్ల జెండాను పెట్టినందుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసనలకు పూనుకున్నారు. అక్కడున్న తాలిబన్లు వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరు పౌరులు చనిపోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆగస్టు 19న అఫ్ఘానిస్థాన్ స్వతంత్య్ర వేడుకలను ప్రతి సంవత్సరం జలాలాబాద్‌లో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే, జాతీయ జెండాను తొలగించడంతో ప్రజలు తీవ్ర నిరసనకు పూనుకున్నారు. తర్వాత జరిగి ఊరేగింపులో ప్రజలు జాతీయ జెండాలను పట్టుకుని వెళ్లారు. వారిని చూసిన ప్రజలు కేరింతలు కొడుతూ స్వాగతించారు. జలాలాబాద్ పక్కన ఉన్న జిల్లాల్లోనూ ఇదే రకమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాల్పులు సైతం జరిగాయి. కాబూల్ విమానాశ్రయంలోకి ప్రజలు చేరుకోకుండా తాలిబన్లు పహారా కాస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ దౌత్య సిబ్బంది, ఇతర పౌరులను మిమానలు ఎక్కించి పంపడంలో తాలిబన్లు సహకరిస్తున్నారు.
సోషల్ మీడియా నుంచి ఫొటోలు, వ్యాసాలు తొలగిస్తున్న అమెరికా
అమెరికా, నాటో దళాలకు సహకరించిన వారి ఫొటోలను, అప్పట్లో జరిగిన సంఘటనపై వచ్చిన వ్యాసాలను అమెరికా ఏజెన్సీలు తొలగిస్తున్నాయి. అమెరికాకు సహకరించిన అఫ్ఘన్ పౌరుల పేర్లు ఉంటే వారిపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటారనీ, వారికి ప్రమాదం పొంచి ఉన్నదనే కారణంతో అమెరికా ఈ చర్యలకు దిగింది.
అష్రఫ్ ఘనీకి యూఏఈ ఆశ్రయం
అఫ్ఘన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అఫ్ఘన్ విడిచి పారిపోయన సంగతి తెలిసిందే. తాజాగా మానవతా ప్రాతిపదికన ఘనీకి ఆశ్రయం కల్పిస్తున్నట్టు యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ బుధవారం ప్రకటించింది. ఆయనతో పాటు అతని కుటుంబానికి స్వాగతం పలుకుతున్నట్టు తెలిపింది.
తాలిబన్ల చెరలో తొలి మహిళా గవర్నర్
అఫ్ఘన్ తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీని తాలిబన్లు బంధించినట్టు సమాచారం. అఫ్ఘానిస్థాన్లోని బల్ ప్రావిన్స్‌లోని చహర్ కింట్ జిల్లాకు చెందిన సలీమా అఫ్ఘన్ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఓవైపు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సహా ఇతర నేతలంతా పారిపోతున్నా బల్ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించకుండా ఆమె ఎదురొడ్డి నిలిచారు. కానీ.. చివరికి తాలిబన్లు ఆ ప్రాంతంపై పట్టు సాధించారు. మరోవైపు కాబూల్ తమ హక్కుల కోసం పోరాడుతూ నలుగురు మహిళలు నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడుకుంటామంటూ ఫ్లకార్డుల ప్రదర్శించారు.