Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు, రెండు ఎంఎల్ సీసాల్లో విక్రయం
- భారత్, ఉగాండాలో గుర్తింపు : డబ్ల్యూహెచ్ఓ ప్రకటన
జెనీవా-ఆహారపదార్థాలు మొదలుకుని డిమాండ్ ఉన్న వస్తువులన్నింట్లో నకిలీలే దర్శనమిస్తున్నాయి. నకిలీ, ఒరిజినల్‌కు ఏమాత్రం తేడా లేకుండా అక్రమార్కులు వ్యాపారం చేసేస్తున్నారు. తాజాగా కరోనా నియంత్రణకు వాడే కోవిషీల్డ్ నకిలీ వ్యాక్సిన్ మార్కెట్లో అమ్ముడవుతున్నది. దీనిపై ప్రపంచఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, ఉగాండా దేశాల్లో ఈ నకిలీ కరోనా వాక్సిన్ను గుర్తించామని తెలిపింది. గుర్తింపు ఉన్న వ్యాక్సిన్ సెంటర్ వెలుపల ఈ నకిలీ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నట్టు గమనించింది. ఇప్పటికే పదిడోసులు వినియోగించినట్టు దర్యాప్తులో తేలింది. అయితే తాము కోవిషీల్డ్ రెండు ఎం.ఎల్ సీసాను సరఫరా చేయలేదని సీరమ్ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) వెల్లడించింది. మరోవైపు ఉగాండాలో నకిలీ కోవిషీల్డ్ సీసా 5 మి.లీ.ఉన్నట్టు తేలింది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి పది డోసులు వేసినట్టు అధికారులు నిర్ధారించారు. బ్యాచ్ నంబర్ 4121 జడ్ 040, నకిలీ గడువు తేదీ ఆగస్టు 10 అని దీనిపై ముద్రించి ఉన్నట్టు ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సర్వైలెన్స్ అండ్ మానిటరింగ్ సిస్టమ్‌తో నకిలీ, నాసిరకం వైద్య ఉత్పత్తులపై ఆరా తీస్తున్నప్పుడు ఈ నకిలీ కోవ్‌షీల్డ్ వ్యాక్సిన్ల వ్యవహారం వెలుగుచూసింది.దక్షిణ ఆసియా,ఆఫ్రికా దేశాల్లో నకిలీ మందులు, టీకాలు కనిపించగానే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక జారీ చేసింది. 2021 జులై-ఆగస్టు మాసాల్లో కోవ్‌షీల్డ్ నకిలీ వ్యాక్సిన్ల విక్రయాలు జరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైద్య ఉత్పత్తులు సరఫరాచేసే సంస్థలపై నిఘా అవసరమమని ప్రపంచ దేశాలను అప్రమత్తంచేసింది. అయితే నకిలీ కరోనా వ్యాక్సిన్ పట్టుపడటం ఇదే మొదటిసారి కాదు. అమెరికన్ దేశాల్లో ఫైజర్-బయో ఎంటెక్ నకిలీ కరోనా వ్యాక్సిన్ మార్కెట్లో లభ్యమవుతున్నట్టు కూడా డబ్ల్యూహెచ్ఓ గతంలో గుర్తించింది.
ఆరోగ్యానికి ముప్పు
నకిలీ కరోనా వ్యాక్సిన్‌ను గుర్తించిన వెంటనే వాటిని నాశనం చేయాలని డబ్ల్యూహెచ్ఓ ఆదేశించింది. విక్రయదారులపై చర్య తీసుకోవాలని పేర్కొన్నది. నకిలీ టీకాలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందనీ, ఆరోగ్యసమస్యలు ఉన్న రోగులపై ఇలాంటి వ్యాక్సిన్లను వినియోగిస్తే, ప్రాణాంతకంగా మారే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేసింది.