Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షులు జో బైడెన్, అతని భార్య త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకోనున్నారు. గురువారం ప్రసారం కానున్న ఎబిసి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే వచ్చే నెలలో దేశంలో పెద్దలందరికీ బూస్టర్ డోసులు అందుబాటులోకి తీసుకువస్తామని బైడెన్ ప్రకటించారు. డెల్టా వేరియంట్ వంటి కొత్త కరోనా వైరస్లు బయటపడుతుండటంతో, పెద్దలందరూ తమ రెండో డోసు పొందిన ఎనిమిది నెలల తరువాత ఈ బూస్టర్ డోసులు పొందవచ్చనని బైడెన్ తెలిపారు. సెప్టెంబర్ 20 నుంచి ఈ బూస్టర్ డోసులు అందుబాటులోకి రానున్నాయి.
బూస్టర్ డోసులను ఖండించిన డబ్ల్యూహెచ్ఓ
కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని ఇప్పటి వరకూ ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించలేదని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు స్పష్టం చేశారు. త్వరలోనే బూస్టర్ డోసులు అందుబాటులోకి తీసుకునివస్తామని అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే డబ్ల్యూహెచ్ఓ నిపుణులు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇంకా అనేక మంది వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంటే అమెరికన్లకు బూస్టర్ డోసులు అందించడం అనైతికమని నిపుణులు విజ్ఞప్తి చేశారు. 'మనం ఇప్పటికే లైఫ్ జాకెట్లు ఉన్న ప్రజలకు అదనంగా లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి ప్రణాళికలు వేస్తున్నాం. మరోవైపు ఒక్క లైఫ్ జాకెట్ కూడా లేకుండా మునిగిపోతున్న ప్రజల్ని వదిలివేస్తున్నాం' అని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.