Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు చోట్ల ఆందోళనకారులపై తాలిబన్ల కాల్పులు
- పలువురు మృతి, పలువురికి గాయాలు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పుతామని ప్రకటించినప్పటికీ తాలిబన్లు ఆందోళనకారులపై గురువారం కాల్పులు జరిపారు. అసాదాబాద్ నగరంలో జాతీయ పతాకాన్ని ఊపుతున్న ఆందోళనకారులపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. దాంతో అక్కడి పరిస్థితి తొక్కిసలాటకు దారితీసింది. చాలామంది చనిపోయారని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. తాలిబన్ల చర్యలకు ప్రజల్లో వ్యతిరేకత తొలుత ఇక్కడే కనిపించింది. అసదాబాద్‌లో ఆందోళనకారులు తాలిబన్ల పతాకాన్ని చించివేసిన అనంతరం జాతీయ పతాకాన్ని ఊపుతూ తిరిగారు. అయితే మరణించినవారు కాల్పుల్లో మరణించారా లేక తొక్కిసలాటలో మరణించారా అనేది తెలియరాలేదు. వందలాదిమంది వీధుల్లోకి వచ్చారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. మొదటగా వెళ్లడానికి భయపడ్డా, కానీ మా పొరుగునున్నవారు వారితో కలవడంతో నేను కూడా ఇంట్లో వున్న పతాకాన్ని తీసుకుని వెళ్ళానని మహ్మద్ సలీమ్ అనే వ్యక్తి చెప్పారు. కునార్ ప్రావిన్స్ రాజధాని అయిన అసాదాబాద్లో పలువురు మరణించారు, గాయపడ్డారని తెలిపారు. కాగా ఈ సంఘటనపై తాలిబన్ ఇప్పటివరకు స్పందించలేదు. జలాలాబాద్‌లో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానిక మీడియా తెలిపింది. పక్తియా ప్రావిన్స్‌లో కూడా అల్లర్లు జరిగినట్లు తెలుస్తోందని, అయితే అక్కడ తీవ్రంగా హింస చెలరేగిందా లేదా అన్నది తెలియరాలేదని పేర్కొంది. మరో తూర్పు నగరమైన ఖోస్త్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా, అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో తనకు తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేV్‌ా ఈ ఆందోళనలకు మద్దతునిచ్చారు. జాతీయ పతాకాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కరికి వందనం అంటూ ట్వీట్ చేశారు.