Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్ఘనిస్తాన్ పొరుగుదేశాలు సరిహద్దులు తెరచివుంచాలి:
- ఐరాస శరణార్థుల హైకమిషన్ పిలుపు
జెనీవా/న్యూఢిల్లీ : ప్రత్యేక ద్వైపాక్షిక కార్యక్రమాల ద్వారా పలుదేశాలు చేపడుతున్న ఆఫ్ఘన్ల తరలింపును ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పౌరుల విషయంలో అత్యవసర, విస్తృతమైన అంతర్జాతీమ మానవతా స్పందన అవసరమని ఐరాస శరణార్థుల హైకమిషనర్(యూఎన్‌హెచ్‌సీఆర్) అధికార ప్రతినిధి షబియా మంటూ నొక్కిచెప్పారు. జెనీవాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ సాధారణ మార్గాల ద్వారా అత్యధిక మంది ఆఫ్ఘన్లు తమ దేశాన్ని విడిచివెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఈ రోజుకి కూడా ప్రమాదంలో ఉన్న బయటకు వచ్చేందుకు స్పష్టమైన మార్గం లేదని పేర్కొన్నారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పొరుగున ఉన్న దేశాలు తమ సరిహద్దులను తెరచి ఉండాలని, ఆఫ్ఘన్లు ఆశ్రయం పొందేందుకు వీలు కల్పించాలని పిలుపునిచ్చారు. మహిళలు, బాలికలతో సహా దేశంలో పౌరుల మానవ హక్కుల ఉల్లంఘనపై యూఎన్‌హెచ్‌సీఆర్ ఆందోళన చెందుతోందని అన్నారు.
గతంలో అమెరికా, నాటో దళాలకు సహకరించిన వ్యక్తుల లక్ష్యంగా తాలిబన్లు ఇంటింటికి వెళ్లి సోదాలు చేస్తున్నారని, ప్రతీకార భయాలు పెంచుతున్నారని ఐరాస ఒక నివేదికలో వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్లోకి కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికా తాజాగా మరో 3 వేల మందిని తరలించిందని, దీంతో ఈనెల 14 నుంచి తరలించిన వారి సంఖ్య 9 వేలకు చేరిందని వైట్‌హౌస్ పేర్కొంది. ఆఫ్ఘన్ శరణార్ధుల కోసం జర్మనీ విదేశాంగ శాఖ 10 కోట్ల యూరోలు అందిస్తోందని, ఈ నిధులు శరణార్థులకు సాయం అందిస్తున్న పొరుగున్న ఉన్న దేశాలకు మద్దతుగా ఉంటుందని ఆ దేశ ఆర్థిక మంత్రి ఓలాఫ్ స్కోల్జ్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరుల కోసం పాకిస్తాన్ కాబూల్‌కు విమాన సేవలను పునరుద్ధరించింది. 350 మంది ప్రయాణికులను దేశానికి తీసుకుచ్చేందుకు శుక్రవారం రెండు విమానాలు పంపామని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫాహద్ తెలిపారు. వెయ్యి మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పెయిన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. తమ దేశానికి చెందిన 26 మంది పౌరులను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించామని ఇండోనేషియా విదేశాంగమ మంత్రి రెట్నో మర్సూది ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
జర్నలిస్టు కుటుంబసభ్యుడ్ని చంపేసిన తాలిబన్లు
'డ్యూయిష్ వెల్లె(డిబ్ల్యు)' మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టు కుటుంసభ్యుడొకరని తాలిబన్లు చంపేయగా, మరొక సభ్యుడికి తీవ్రంగా గాయాలయ్యాయని జర్మన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది. ప్రస్తుతం జర్మనీలో పనిచేస్తున్న తమ జర్నలిస్టు కోసం తాలిబన్లు ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేస్తున్నారని, ఇతర కుటుంసభ్యులు తాలిబన్ల బారి నుంచి తప్పించుకుపారిపోయారని తెలిపింది. డిబ్ల్యు డైరెక్టర్ జనరల్ స్పందిస్తూ.. తమ సంపాదకుల్లో ఒకరి దగ్గరి బంధువుని తాలిబన్లు హత్య చేయడం విషాదకరమని, ఆప్ఘనిస్తాన్‌లో ఉంటున్న తమ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ఉన్న ప్రమాదానికి ఇది నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న జర్మనీ పౌరుడిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన అతని ప్రాణానికి ప్రమాదమేమీ లేదని, త్వరలోనే అఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారని జర్మనీ ప్రభుత్వ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
పెరుగుతున్న ప్రతీకార భయాలు
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రతీకార భయాలు పెరుగుతున్నాయి. గతంలో అమెరికా, నాటో దళాలతో కలిసి పనిచేసిన వారిని లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు ఇంటింటికి వెళ్లి సోదాలు చేస్తున్నారని ఐరాసకు చెందిన ఒక త్రెట్ అసెస్మెంట్ కన్సల్టెంట్ తన నివేదికలో వెల్లడించింది. కాబూల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న వారిపై కూడా తాలిబన్లు నిఘా ఉంచారని ఈ నివేదికను రూపొందించిన నార్వేజియన్ సెంటర్ ఫర్ గ్లోబల్ అనలైసెస్ పేర్కొంది. షరియా చట్ట ప్రకారం సంబంధిత కుటుంబసభ్యులను విచారించడం, శిక్షించడం జరుగుతుందని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టియన్ నెల్లేమాన్ అన్నారు. అమెరికా, నాటో దళాలతో కలిసి పనిచేసిన వ్యక్తులు, వారి కుటుంసభ్యులు చిత్రహింసలు, మరణశిక్షలకు గురౌతారని భావిస్తున్నామని పేర్కొన్నారు.
భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు!
ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని పైకి చెబుతోన్న తాలిబన్లు ఆచరణలో దాన్ని పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. కాందహార్, హెరాత్ నగరాల్లో మూసివేయబడివున్న భారత్‌కు చెందిన దౌెత్య కార్యాలయాల్లో తాలిబన్లు బుధవారం చొరబడి సోదాలు చేశారని, ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో అనంతరం రెండు కార్యాలయాల వద్ద అక్కడ పార్క్ చేసివున్న కార్లను తీసుకెళ్లిపోయారని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని తము ముందుగానే ఊహించామని సినీయర్ అధికారి ఒకరు అన్నారు. ఈ సోదాలకు ముందు భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన తాలిబన్లు.. కాబూల్ దౌత్యకార్యాలయం నుంచి భారత తన సిబ్బందిని తరలించాలని తాము కోరుకోవడం లేదని పేర్కొంది. భారత ఉద్యోగులతో పాటు భద్రతా సిబ్బంది రక్షణకు హామీ ఇస్తామని ఖతార్‌లోని తాలిబన్ కార్యాలయం నుంచి కూడా భారత ప్రభుత్వానికి సందేశం వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాబూల్, ఢిల్లీలోని పరిచయాల ద్వారా తాలిబన్ రాజకీయ విభాగం చీఫ్ అబ్బాస్ స్టానిక్జారు కార్యాలయం నుంచి ఈ సందేశం పంపారని పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థిలు నేపథ్యంలో భారత్ ఆ దేశంలోని తమ దౌత్య సిబ్బందిని రెండు ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌కు భారత రాయబారిగా ఉన్న రుద్రేంద్ర టాండన్‌కు దేశానికి వచ్చేశారు. ఇంకా మన దేశానికి చెందిన వెయ్యి మంది పౌరుల ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకొనివున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్‌కు కాందహార్, హెరాత్‌తో పాటు కాబూల్, మజార్-ఐ-షరిఫ్ నగరాల్లో కూడా దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. కాబూల్ కార్యాలయాన్ని అధికారింగా మూసివేయకుండా, స్థానిక సాయంతో కార్యాకలాపాలు జరుగుతున్నాయి.
ఆగస్టు 1 తర్వాతే ఏదైనా..!
అమెరికా బలగాల ఉపసంహరణ తేదీ ఆగస్టు 31 దాటేంత వరకు దేశంలో రాబోయే ప్రభుత్వం గురించి ఎలాంటి నిర్ణయాలు లేదా ప్రకటనలు చేయడానికి తాలిబ్న్ గ్రూప్ సిద్ధంగా లేదని తాలిబన్ల చర్చల గురించి తెలిసిన ఆఫ్ఘన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఉపసంహరణ తుది దశ ముగిసే వరకు దేశంలో 'ఏమీ చేయకుండా' ఉండేందుకు తిరుగుబాటుకు అమెరికాతో ఒప్పందం ఉందని తాలిబాన్ ప్రధాన సంధానకర్త అనస్ హక్కానీ తన మాజీ ప్రభుత్వ సంధానకర్తలకు చెప్పారని తెలిపారు. 'ఏమీ చేయకుండా' అనేది రాజకీయ ప్రక్రియకు మాత్రమే పరిమితమన్నదా అనే దానిపై ఆయన వివరణ ఇవ్వలేదు. ఆగస్టు 31 తర్వాత మత ఉద్యమం తదుపరి ప్రణాళికలపై ఆందోళనలతో పాటు తదుపరి ప్రభుత్వంలో తాలిబాన్యేతర అధికారులను చేర్చుతామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందా అనే అంశాన్ని రేకెత్తిస్తుంది. ఇప్పటి వరకు తాలిబాన్లు ఆఫ్ఘన్ జాతీయ రక్షణ, భద్రతా దళాలను మార్చే విషయంపై తమ ప్రణాళికలను గురించి చెప్పలేదు. మరోవైపు కాబూల్‌లోని మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. మసీదు ప్రాంతాల్లో తాలిబన్లు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
తాలిబన్ చీఫ్ ఎక్కడ..?
ఆఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమౌతున్న వేళ..వారి ప్రధాన నేత హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడున్నాడనే దానిపై ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం ఆరా తీస్తోంది. విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పంచుకున్న సమాచారాన్ని అధ్యయనం చేస్తోంది. రహస్యంగా ఉన్న అఖుంద్జాదాను గుర్తించేందుకు చర్యలు చేపడుతోంది. అయితే ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి ఇప్పుడు అతడు పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉండవచ్చునని చెప్పారు. అయితే గత ఆరు నెలలుగా అతడిని తాలిబన్ సీనియర్ నాయకులు, ఆఫ్గాన్‌లో హింసాత్మక చర్యలు చేపడుతున్న తాలిబన్లు కూడా చూడలేదు. అతని చివరి బహిరంగ ప్రకటన మేలో రంజాన్ సందర్భంగా వచ్చింది. కాగా, పాకిస్తాన్ చెరలో ఉండటంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో అన్న విషయంపై భారత్ ఆసక్తి కనబరుస్తుంది. మాజీ తాలిబ్ నేత అక్తర్ మన్సూర్ 2016లో అమెరికా డ్రోన్ల దాడిలో మరణించి తర్వాత హైబతుల్లా అఖుంద్ జాదా తాలిబన్ చీఫ్‌గా నియమితులయ్యారు. తాలిబన్ల బృందంలో హైబతుల్లా కేవలం సైనికుడే కాకుండా రాజకీయ,మిలటరీ, న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు. అయితే పూర్తిగా ఆఫ్గాన్ తాలిబన్ల చేతికి వచ్చాకే ఆయన అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.