Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్, దుబాయ్ : చాలా వేగంగా సంక్రమిస్తున్న డెల్టా వేరియంట్ సోకిన వారు 300 రెట్లు అధికంగా వైరల్ లోడ్‌ను కలిగివుంటున్నారని దక్షిణ కొరియా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. డెల్టా వైరస్ సోకిన వారి లక్షణాలను కొవిడ్ వైరస్ ఒరిజినల్ వెర్షన్ వచ్చిన వారితో పోల్చి చూడగా ఈ పరిస్థితి వుందని, అయితే, కొన్ని రోజుల వ్యవధిలో ఈ వైరల్ లోడ్ క్రమంగా తగ్గుతూ వస్తోందని కొరియా వ్యాధి నియంత్రణ, నివారణా సంస్థ (కెడిసిఎ) పేర్కొంది. నాలుగు రోజుల్లో 30 రెట్లు ఎక్కువగా వుండగా, 9 రోజుల్లో 10రెట్లు , 10 రోజుల తర్వాత ఇతర వేరియంట్లతో సమానంగా వుంటోందని తెలిపింది. అధిక లోడును కలిగి వుండడమంటే చాలా సులభంగా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించడం, ఇన్ఫెక్షన్లు పెరగడం, ఆస్పత్రికి వెళ్ళే పరిస్థితులు పెరగడమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి లీ శాంగ్ వాన్ మీడియాతో అన్నారు. అయితే ఇక్కడ డెల్టా వేరియంట్ 300 రెట్లు ఎక్కువ ఇన్ఫెక్షన్లు కలిగిస్తుందని అర్థం కాదన్నారు. అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే 1.6 రెట్లు ఎక్కువగా, కోవిడ్ ఒరిజినల్ వైరస్‌తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా సంక్రమణ రేటు వుందని భావిస్తున్నట్లు లీచెప్పారు. డెల్టా వేరియంట్ సోకిన 1848 మంది రోగులపై, ఇతర వేరియంట్లు సోకిన 22,106 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు.