Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మలాలాను వేధిస్తున్న తాలిబన్ తూటా గాయం
- ఆఫ్గన్లకు బాసటగా నిలవాలని పిలుపు
బోస్టన్ : తాలిబన్లు చేసిన తూటా గాయం తొమ్మిది ఏండ్లైనా తనను ఇంకా బాధిస్తునే వుందని నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జారు తెలిపారు. 2012లో 15 ఏళ్ళ వయస్సులో తాలిబన్లు ఆమె తలపై కాల్చిన సంగతి తెలిసిందే. స్వాత్ లోయలోని మింగోరాలో ఆమె స్కూలు నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిని నిరసిస్తూ విద్య హక్కు కోసం మలాలా సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకుంటున్న తరుణంలోనే ఆమెకు తాజాగా శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ 9 ఏండ్ల కాలంలో తనకు జరిగిన సర్జరీలు, పడిన బాధల గురించి సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకున్నారు. తాజాగా ఆగస్టు 9న మరో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్గన్ ప్రజానీకానికి అంతర్జాతీయ సమాజం బాసటగా నిలువాలని కోరారు.
యుద్ధం చేస్తున్నా..
'ఆనాడు నా శరీరాన్ని తాలిబన్లు ఛిద్రం చేశారు, అప్పటి నుంచి నా శరీరానికి శస్త్ర చికిత్సలు జరుగుతునే వున్నాయి. రెండు వారాల క్రితమే (ఆగస్టు 9న) బోస్టన్‌లో ఆరోసారి ఆపరేషన్ జరిగింది. ఆ రోజు ఆస్పత్రికి వెళ్ళడానికి లేచేసరికి తాలిబాన్లు కుందుజ్ ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఒకటి తర్వాత ఒకటిగా అన్నీ ప్రధాన నగరాలు వారి వశమయ్యాయి. ఇదంతా చూస్తుంటే నాడు వారు తనకు చేసిన నష్టం గుర్తుకు వచ్చింది' అని మలాలా పేర్కొన్నారు. 'వారు పేల్చిన ఒక్క తూటాతో నా జీవితమే మారిపోయింది. ఇన్నేళ్ళయినా ఇంకా పూర్తిగా కోలుకోవడానికి యుద్ధమే చేస్తున్నా. కానీ గత నాలుగు దశాబ్దాలుగా ఆఫ్ఘన్ ప్రజలు లక్షలాది బుల్లెట్లను ఎదుర్కొంటున్నారు. సాయం కోసం వారు చేస్తున్న ఆక్రందనలు మనస్సును తొలిచివేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం వారికి బాసటగా నిలబడాలి' అని మలాలా పిలపునిచ్చారు.