Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరు పక్షాల మధ్య కాబూల్‌లో చర్చలు
బీజింగ్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తాలిబన్లతో చైనా దౌత్య సంబంధాలను పెట్టుకుంది. ఇప్పుడు ఇరు పక్షాల మధ్య ఎలాంటి అవరోధాలు లేని, సమర్ధవంతమైన కమ్యూనికేషన్ వుందని చైనా అధికారి బుధవారం చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా రాయబారి వాంగ్ యు, తాలిబన్ రాజకీయ కార్యాలయ డిప్యూటీ హెడ్ అబ్దుల్ సలామ్ హనఫి మధ్య కాబూల్‌లో చర్చలు జరిగిన విషయంపై విలేకర్లు ప్రశ్నించగా, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ పై వివరణ ఇచ్చారు. కీలకమైన విషయాలు చర్చించడానికి సహజంగానే కాబూల్ మాకు ముఖ్యమైన వేదిక, మార్గమని వాంగ్ వ్యాఖ్యానించారు. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ఆఫ్ఘన్లకు తమ భవిష్యత్‌ను నిర్ణయించుకునే స్వేచ్చ వుందని, దాన్ని చైనా గౌరవిస్తుందని అన్నారు. ఆఫ్ఘన్ల నేతృత్వంలో, ఆఫ్గన్‌కి చెందిన సిద్ధాంతాన్ని అమలు చేయడానికి మద్దతిస్తుందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహ సంబంధాలను, సహకారాన్ని కొనసాగించడానికి తాము సిద్ధంగా వున్నామని స్పష్టం చేశారు. ఆ దేశ శాంతి, పునర్నిర్మాణ కార్యకలాపాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు. చైనాతో పాటు పాకిస్తాన్, రష్యాలు కాబూల్‌లో తమ ఎంబసీలను కొనసాగిస్తున్నాయి. భారత్, అమెరికా సహా ఇతర దేశాలు మూసివేశాయి. యావత్ ప్రపంచం నివ్వెరపోయే రీతిలో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుండి చైనా మౌనంగానే వుంది. కాబూల్‌లో అందరినీ కలుపుకునిపోయే ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చింది. నిజాయితీతో కూడి, దేశీయ, విదేశాంగ విధానాలను రూపొందించుకుని, అమలు చేయాలని కోరింది. ప్రజల, అంతర్జాతీయ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిందిగా కోరింది.