Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికీలీక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ క్రిస్టినా విమర్శ
వాషింగ్టన్ : గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘన్లో సాగుతున్న యుద్ధానికి సంబంధించి వాస్తవాలను దాచడంలో పశ్చిమ దేశాల మీడియా కూడా భాగస్వామి అని, అసాధారణ అసత్యాన్ని అనుమతించిందని వికీలీక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ క్రిస్టిన్ హ్రాఫ్సన్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అర్ధంతరంగా అమెరికా వైదొలగడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదని అన్నారు. కానీ రెండు దశాబ్దాలుగా యావత్ ప్రపంచాన్ని అమరికా మోసం చేయగలిగిందనే వాస్తవం విస్మయపరిచిందని అన్నారు. 19ఏళ్ళ పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సాగించిన యుద్ధం చాలా పెద్ద అబద్ధమని అన్నారు. ఆ యుద్ధం వల్ల కేవలం అమెరికా మిలటరీ ఇండిస్టియల్ కాంప్లెక్స్‌కు, ప్రైవేటు కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ది చేకూరిందని విమర్శించారు. ప్రధాన స్రవంతిలోని మీడియా కూడా ఈ అసత్యాలను పట్టుకోలేకపోయిందని అన్నారు. 11ఏళ్ళ క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరిగిందో వాస్తవ దృశ్యాన్ని తెలిపే పత్రాలను వికీలీక్స్ ప్రచురించిందని హ్రాఫ్సన్ చెప్పారు. ఆఫ్ఘన్ యుద్ధ డైరీగా పిలిచే ఈ పత్రాల్లో 2004, 2010 మధ్య కాలంలో అమెరికా మిలటరీ అంతర్గత విషయాలు, దౌత్యపరమైన సమాచారం, సిఐఎ డాక్యుమెంట్లు వున్నాయి. అమెరికా మిలటరీ చరిత్రలోనే అతిపెద్ద లీకేజీ అయిన ఇందులో 91వేల పత్రాలు వున్నాయి. ఆ సమయంలో ఈ వార్త పతాక శీర్షికలోకి ఎక్కలేదు. కానీ తర్వాత వేగు చెల్సియా మానింగ్ను అరెస్టు చేసి, ప్రాసిక్యూషన్ జరపడానికి పరిస్థితులు దారి తీశాయి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెకు వేధింపులు మొదలయ్యాయి. ఇన్ని పత్రాలు వెలువరించినా ఇప్పటికీ ఆఫ్ఘన్ యుద్ధం గురించి ప్రజల్లో నెలకొన్న సాధారణ అభిప్రాయాలు మారలేదని అన్నారు. అ అసత్యాలు అలానే కొనసాగుతున్నాయన్నారు. ఈ వ్యవహారాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తుందని అన్నారు. ఇది ఎంత కాలం కొనసాగుతుందో చూడాలని అన్నారు.వాస్తవానికి ఇది విస్మృత యుద్ధంగా మారిపోయిందని అన్నారు.ఎందుకంటే దాని తర్వాత ఇరాక్‌పై జరిగిన యుద్ధంతో ఇది తుడిచిపెట్టుకుపోయిందన్నారు. 2019లో వాషింగ్టన్ పోస్ట్ తిరిగి ఆఫ్ఘన్ పత్రాలను ప్రచురించే వరకు అసలు ఆ దేశంలో ఏం జరుగుతున్నదానిపై చర్చలు జరగలేదని అన్నారు. వాస్తవాల పట్ల పశ్చిమ దేశాల మీడియా అస్సలు దృష్టి పెట్టలేదన్నారు. వాస్తవాలను దాచడంలో మీడియా కూడా భాగస్వామి అయిందన్నారను.