Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాబూల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయండి
- ప్రజలను కోరిన పశ్చిమ దేశాలు
లండన్ : ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవడానికి కాబూల్ విమనాశ్రయం లోపల, వెలుపల ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదుల దాడి జరిగే అవకాశమున్నదని బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు పశ్చిమ దేశాలు గురువారం హెచ్చరించాయి. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు దాడికి పాల్పడతారని విశ్వసనీయమైన నివేదిక తమకు అందినట్లు బ్రిటన్ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో ఐసీసీ అనుబంధ సంస్థ అయిన ఐసీస్-కె దాడి చేసే ముప్పు గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ వారం ప్రారంభంలో హెచ్చరించారు. దాడి జరిగే అవకాశాలపై చాలా విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ నివేదిక తమకు అందిందని బ్రిటన్ సాయుధ బలగాల మంత్రి జేమ్స్ హీప్పే గురువారం మీడియాకు చెప్పారు. తమ పౌరులను విమానాశ్రయ ప్రాంతం నుండి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతూ అమెరికా దాని మిత్ర పక్షాలు ఇప్పటికే పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశాయి. భద్రతా కారణాల రీత్యా వెంటనే విమానాశ్రయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిసే పేనే మాట్లాడుతూ తీవ్రవాదుల ముప్పు పొంచి వుందని హెచ్చరించారు. కాగా ఈ ప్రాంతంలో పరిస్థితి చాలా సున్నితంగా వుందని విదేశీ, కామన్వెల్త్ అభివృద్ది కార్యాలయం (ఎఫ్సీడీఓ) వ్యాఖ్యానించింది. బ్రిటన్ పౌరులు సహా ఇతరులందరూ వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని తదుపరి సూచనలకై వేచి వుండాలని కోరింది. కాబూల్ విమానాశ్రయానికి ప్రయాణం చేయవద్దని సూచించింది. ప్రస్తుతం అమెరికా బలగాల అధీనంలో వున్న కాబూల్ విమానాశ్రయంలో 5800మంది బలగాలు వున్నాయి. ఈ నెల 15 నుండి ఇప్పటివరకు దాదాపు 90వేల మంది ఆఫ్ఘన్లు, విదేశీయులు దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇంకా ఇలా వెళ్ళాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతునే వుంది. విమానాశ్రయం లోపల, వెలుపల వేలాదిమంది ప్రజలు గుంపులు గుంపులుగా వేచి చూస్తున్నారు. మంగళవారం గడువు తర్వాత అమెరికా విమానాలు నిలిచిపోవచ్చని తెలిసి వారిలో అసహనం పెరిగిపోతోంది.