Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాబూల్ విమానాశ్రయం వద్ద ఘటన
- చిన్నారులతో సహా 20 మంది మృతి.. పలువురికి గాయాలు
- వెల్లడించిన తాలిబాన్ అధికారి ొ ధ్రువీకరించిన పెంటగాన్
కాబూల్: కాబూల్ విమానాశ్రయం వెలుపల గురువారం రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 20 మంది మరణించారు. ఇంకా అనేక మంది గాయపడినట్లు తాలిబాన్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలియజేశారు. విమానాశ్రయం వెలుపల పెద్ద యెత్తున పేలుళ్లు చోటుచేసుకున్న మాట నిజమేనని అమెరికా రక్షణ శాఖ( పెంటగాన్) ప్రతినిధి జాన్ కెర్బీ తెలిపారు. ఇది ఆత్మాహుతి బాంబు దాడిలా కనిపిస్తోందని అమెరికా అధికారులు తెలిపారు. నిర్ధారణ కాని వార్తలను బట్టి విమానాశ్రయం మెయిన్ గేట్ (అబ్బే గేట్) వద్ద వేల సంఖ్యలో జనం గుమికూడి ఉన్నారని, కాబట్టి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. పశ్చిమ దేశాలకు చెందినవారు ఎక్కువగా ఉండే బార్ హోటల్ విమానాశ్రయ గేటుకు సమీపంలో ఉంది. అక్కడ మరో బాంబు పేలింది. ఆఫ్ఘన్ నుంచి ఖాళీ చేయించిన తమదేశస్తులను పశ్చిమ దేశాలు తాత్కాలికంగా ఇక్కడ ఉంచాయి. కొంత మందిని అక్కడి నుంచి తరలించినప్పటికీ, ఇంకా అనేక మంది అక్కడ ఉన్నట్లు తెలిసింది. విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని ఐఎస్ సాయుధ గ్రూపు నుంచి అంతకుముందు బెదిరిం పులు వచ్చినందున ఈ పేలుళ్లు దాని పనే అయివుంటుందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఈ పేలుళ్లతో ఆ ప్రాంతంలో భయానకవాతావరణం చోటుచేసుకుంది. కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడికి కుట్ర పన్నితే సహించేది లేదని నాటోను తాము ఇంతకుముందే హెచ్చరించామని తాలిబాన్ ప్రతినిధి రష్యన్ మీడియాతో అన్నారు. ఈ పేలుళ్లు జిహాదిస్టుల్లోని చీలిక గ్రూపు ఐఎస్ పనే అయి వుంటుందని అమెరికా, బ్రిటన్ పేర్కొన్నాయి. ఈ గ్రూపు ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ఖొరసాన్ ప్రావిన్స్‌లో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తుందని, ఈ గ్రూపు మొదటి కమాండర్‌గా పాకిస్తాన్‌కు చెందిన హఫీజ్ సయీద్ వ్యవహరిం చారని పశ్చిమ దేశాల అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్లో పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ భద్రతాదళ అధికారులతో చర్చిం చారు. పేలుళ్ల వార్త విన్న వెంటనే బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ కాబూల్ విమానాశ్రయంలో బ్రిటిష్ పౌరులు, సిబ్బంది పరిస్థితి గురించి ఆరా తీసింది. వారిని సురక్షితంగా దేశానికి తీసుకురావడంపైనే దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటివరకు 88వేల మంది విదేశీయులను ఆయా ప్రభుత్వాలు విమానాల్లో తీసుకువెనక్కి రప్పించాయి. ఈ గందరగోళం మధ్య ఆఫ్ఘనిస్తాన్లోని విదేశీయులను, ఆప్ఘన్లను తీసుకుని ప్రతి 39 నిమిషాలకు ఒక విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి బయల్దేరుతున్నది.
మిత్రులను విస్మరించి తాలిబన్లను కౌగిలించుకున్నారు : రిపబ్లికన్ పార్టీ నేత
అమెరికా ప్రతిష్టను బైడెన్ ప్రభుత్వం నిలువునా మంటగలిపిందని రిపబ్లికన్ పార్టీ నేత మెక్ కార్దీ విమర్శించారు. అమెరికాకు సాంప్రదాయక మిత్రులుగా ఉన్నవారిని పక్కనపెట్టి, తాలిబాన్లతో బైడెన్ దోస్తీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కేపిటల్ హిల్స్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ప్రతిష్టను మంటగలిపారని విమర్శించారు.