Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు
వాషింగ్టన్ : కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఐఎస్-ఖొర్సాకి చెందిన ఆస్తులు, స్థావరాలు, నాయకత్వంపై దాడులకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మిలటరీ కమాండర్లను ఆదేశించారు. దీనిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని బైడెన్ ప్రకటించారు. ''ఈ దాడులకు పాల్పడిన వారు, అమెరికాకు హాని కలిగించాలనుకునేవారు ఒక్క విషయం తెలుసుకోవాలి. మేం క్షమించేది లేదు. క్షమించబోం. కచ్చితంగా మిమ్మల్ని వేటాడతాం. మీరు మూల్యం చెల్లించాల్సిందే''నని బైడెన్ పేర్కొన్నారు. దాడి జరిగిన అనంతరం వైట్‌హౌస్ నుంచి జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ''మరింత కచ్చితత్వంతో, బలప్రయోగంతో స్పందిస్తాం. మేమనుకున్న సమయంలో, మేము ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ప్రతిస్పందించి తీరుతామని'' బైడెన్ పేర్కొన్నారు. మా ప్రజలను, ప్రయోజనాలను రక్షించుకుంటామని తెలిపారు. అవసరమనుకుంటే ఆఫ్ఘనిస్తాన్‌కు మరింత మిలటరీ సాయాన్ని పంపిస్తామని బైడెన్ సూచనప్రాయంగా తెలిపారు. అవసరాన్ని బట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మిలటరీని కోరినట్టు చెప్పారు. ఒకవేళ అదనపు బలగాలు కావాలన్నా మంజూరు చేస్తామని చెప్పారు. ఇటువంటి దాడులు తమ మిలటరీ కృత నిశ్చయాన్ని మరింత పెంచుతాయన్నారు. ఈ దాడిలో మరణించిన అమెరికన్ సైనికులు యోధులని వ్యాఖ్యానించారు. ఇతరుల భద్రత, స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో వారు ప్రాణాలు అర్పించారని ప్రశంసించారు. కాబూల్ విమానాశ్రయానికి భద్రత అందించే విషయంలో తాలిబన్లపై ఆధారపడడాన్ని ఆయన సమర్ధించుకున్నారు. ఐఎస్, తాలిబన్లు మధ్య సంబంధాలు వున్నట్టు ఇప్పటివరకు సాక్ష్యాధారాలు లేవన్నారు. కాగా, ఇప్పటివరకు ఆత్మాహుతి దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 103కి చేరింది. వీరిలో 13మంది అమెరికన్లు కాగా, మిగిలినవారు ఆఫ్ఘన్లు, అయితే తమ వారు కూడా 28మంది వున్నారని తాలిబన్లు ప్రకటించారు. రెండు పేలుళ్ళు, తుపాకుల కాల్పుల్లో మరణించిన వారి మృత దేహాలు చెల్లాచెదురుగా విమనాశ్రయం ప్రాంతమంతా పడి వున్న వీడియోలను ఆఫ్ఘన్ జర్నలిస్టులు విడుదల చేశారు. అమెరికన్ ఆర్మీని, వారికి సహకరించిన వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఐసిస్ తెలిపింది.
మరిన్ని దాడులు ?
విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడుల జరిగే అవకాశం వుందని అమెరికన్ సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకింజె హెచ్చరించారు. రాకెట్లు, వాహన బాంబులతో దాడులు జరగవచ్చని అన్నారు. దేన్నైనా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా వున్నామన్నారు.