Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికాతో కలసి ఆఫ్ఘనిస్తాన్పై దండెత్తిన బ్రిటన్ చివరికి ఏమీ సాధించలేక తోకముడిచింది. ఆగస్టు 31 లోగా అమెరికా, బ్రిటన్, నాటో దళాలు దేశాన్ని వీడి వెళ్లకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయని తాలిబాన్లు హెచ్చరించిన నేపథ్యంలో గడువుకు రెండు రోజుల ముందే బ్రిటిష్ చివరి సైనిక పటాలం కాబూల్‌ను ఖాళీ చేసివెళ్లిపోయింది. వీరోచితమైన రీతిలో తరలింపు ప్రక్రియ సాగిందని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. అర్హత కలిగిన కొంతమంది ఆఫ్ఘన్లను తీసుకురాలేకపోయామని, వారిని అక్కడే వదిలివేయాల్సి వచ్చిందని బ్రిటన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బ్రిటన్ జాతీయులను, ఆఫ్ఘన్ పౌరులను కాబూల్ విమానాశ్రయం నుండి తీసుకురావడానికి వెళ్ళిన దాదాపు 1000మంది సైనికులు అక్కడ నుండి బయలుదేరారని శనివారం పొద్దుపోయిన తర్వాత బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. పౌరుల తరలింపునకు ఉద్దేశించిన చివరి విమానం కాబూల్ నుండి బయలుదేరిన కొద్ది గంటల తర్వాత సైనికులు బయలుదేరారు. అమెరికా మినహా చాలా దేశాలు తమ దళాలను ఇప్పటికే ఉపసంహరించుకున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో బ్రిటన్ రాయబారి లారీ బ్రిస్టో విమానాశ్రయంలో మాట్లాడుతూ, ఇక ఈ ఆపరేషన్ దశను ఇక్కడితో ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ తరలించాల్సిన అవసరమున్న వారు కొంతమంది వున్నారని, వారికి చేయాల్సిన సాయం చేస్తామని చెప్పారు. గత రెండు వారాల్లో 15వేల మందిని ఖాళీ చేయించి వెనక్కి రప్పించింది. బ్రిటన్ రావడానికి అర్హత ఉన్న 1100 మంది ఆఫ్ఘన్లను అక్కడే వదిలి వేయాల్సి వచ్చిందని బ్రిటన్ తెలిపింది.