Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ మూలాల అన్వేషణపై డబ్ల్యుహెచ్ఓ స్పష్టీకరణ
సింగపూర్ : కోవిడ్ వైరస్ మూలాల అన్వేషణలో రాజకీయాలకు ఎలాంటి తావు లేదని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. వైరస్ మూలాల కోసం సాక్ష్యాధారాల ప్రాతిపదికన అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రీయరీతుల్లో కృషి జరగాలని పిలుపునిచ్చారు. ''ఇందులో రాజకీయాలకు అసలు స్థానమే లేదు. ఎందుకంటే దీని వెనుక గల కారణాలు, పరిస్థితులన్నీ మనకు చాలా కీలకమైనవి. అది ఏ దేశమైనా, ప్రాంతమైనా దానితో ఎలాంటి సంబంధం లేదు.'' అని సిఎఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. రాజకీయాల నుంచి దీనిని వేరు చేసి చూడాల్సిన అవసరం వుంది. శాస్త్రవేత్తలను తమ విధి నిర్వహణలో ముందుకు సాగనివ్వండని ఆమె కోరారు. కరోనా మహమ్మారిపై బహిరంగంగా, శాస్త్రీయ చర్చ జరిగేలా డబ్ల్యుహెచ్ఓ ప్రోత్సహిస్తున్నదని, అంతేకాని, ఎవరు బాధ్యులని కనుగొనడం సరైన ప్రశ్నే కాదన్నారు. ఇది ప్రకృతిపరంగా జరిగిన పరిణామమే అయితే, ఎక్కడైనా జరగవచ్చు, గతంలో ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో సంభవించి వుంటే రేపు ఎక్కడైనా జరిగేందుకు అవకాశం వుంది. దీన్నుండి మనం బయటపడడానికి ముందుగానే మరో కొత్త మహమ్మారి మనపై పడవచ్చని ఆమె పేర్కొన్నారు.