Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలుచోట్ల రాకెట్ల దాడులు, తుపాకుల మోత !
కాబూల్ : దాడులు, ప్రతి దాడులతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ సోమవారం దద్దరిల్లింది. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ గడువు ముగియడానికి ఇంకా ఒక రోజు వ్యవధి మాత్రమే ఉండడంతో చివరి సైనిక పటాలాన్ని తరలించే ప్రక్రియ జోరందుకుంది. విమానాశ్రాయనికి సమీపంలో రాకెట్ల దాడి పరంపర ఒక వైపు, యాంటీ రాకెట్ క్షిపణులు, డ్రోన్లతో అమెరికా మరో వైపు దాడులు సాగించాయి. కొన్ని చోట్ల తుపాకుల మోత కూడా వినిపించింది. కాబూల్ విమానాశ్రయానికి చేరువలో మూడు పేలుళ్ళ శబ్దాలు వినిపించాయని, ఆకాశంలోకి మాంసం ముద్ద ఎగరడం చూశామని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పేలుళ్లు వినపడడంతో ప్రజలు అక్కడ నుండి పారిపోయారు. దీనిపై వ్యాఖ్యానించమని కోరగా అమెరికా అధికారులు వెంటనే స్పందించలేదు. రాకెట్ దాడుల అనంతరం కూడా అమెరికా మిలటరీకి చెందిన కార్గో విమానాలు తమ తరలింపులను కొనసాగించాయి. వాహనం వెనుక వైపు నుండి రాకెట్ దాడి జరిగిందని ఆఫ్ఘన్ మీడియా తెలిపింది. కాబూల్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు రాకెట్లు పడ్డాయని పజ్వాక్ వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడి గురించి అధ్యక్షుడు బైడెన్‌కు తెలియచేసినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. సరైనా ప్రయాణ పత్రాలతో వున్న వారిని దేశం వీడి వెళ్లడానికి అనుమతించాల్సిందిగా తాలిబన్ల నుండి హామీ పొందినట్లు ఆదివారం అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై నాటో, యురోపియన్ యూనియన్ సహా దాదాప వంద దేశాలు సంతకాలు చేశాయి. మంగళవారం అమెరికా ఉపసంహరణ పూర్తయిన తర్వాత సాధారణ ప్రయాణాలను అనుమతిస్తామని తాలిబన్లు తెలిపారు. విమానాశ్రయంపై నియంత్రణను తాము తీసుకుంటామన్నారు.
అమెరికా దాడిలో 9 మంది పౌరులు మృతి ?
కాబూల్‌లో ఉగ్రవాదులకు చెందినదిగా భావిస్తున్న వాహనాన్ని దాడి చేసి ధ్వంసం చేశామని అమెరికా చేసిన ప్రకటన బూటకమని తేలిపోయింది. ఆదివారం జరిపిన డ్రోన్ల దాడిలో తొమ్మిది మంది పౌరులు మరణించారని వార్తలు వచ్చాయి. ఇందుకు అమెరికా కొంచెం కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించి చేతులు దులిపేసుకుంది. అమెరికా జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది చనిపోయారు.. అయితే ఈ మరణాలు తమ దాడి వల్ల జరిగినవి కాదని, తాము పేల్చివేసిన వాహనంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలు ఉండడం వల్లే ఇవి జరిగాయని అమెరికా సైనిక ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అమెరికా ఏకపక్ష డ్రోన్ల దాడిని ఖండిస్తున్నాం : తాలిబన్లు
కాబూల్‌లో అనుమానాస్పద ఆత్మాహుతి దాడిని లక్ష్యంగా చేసుకుని అమెరికా జరిపిన డ్రోన్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ అధికార ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ దాడులు చేపట్టే ముందు అమెరికా సమాచారం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ల దాడిలో సుమారు ఏడుగురు మృతి చెందినట్లు చైనా టెలివిజన్ సిజిటిఎన్ సోమవారం పేర్కొంది.. విదేశీ గడ్డపై అమెరికా చర్యలు చట్ట విరుద్ధమైనవని అన్నారు. 'ఆఫ్గనిస్తాన్‌లో ఏదైనా ముప్పు పొంచి ఉన్నట్లయితే మాకు చెప్పాలి. ఏకపక్ష వైఖరితో వ్యవహరించకూడదు. దీని కారణంగా అనేక మంది పౌరులు చనిపోయారు' అని ముజాహిద్ అన్నారు.