Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన బైడెన్
వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా 20ఏండ్లుగా సాగిస్తున్న మిలటరీ కార్యకలాపాలు ముగిసినట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆ దేశం నుండి సైనికులందరూ బయలుదేరిన కొద్ది గంటల తర్వాత ఈ ప్రకటన జారీ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఉపసంహరణ క్రమాన్ని మరింత ప్రాణ నష్టం లేకుండా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసినందుకు సాయుధ బలగాలకు బైడెన్ కృతజ్ఞతలు తెలియచేశారు. ''ప్రస్తుతానికి, అనుకున్న ప్రకారం మా తరలింపు ప్రక్రియను ముగించాలన్నది మా జాయింట్ చీఫ్‌ల, కమాండర్ల ఏకగ్రీవ సిఫారసు అని చెబుతాను. మా బలగాల ప్రాణాలను కాపాడేందుకు, ఆఫ్ఘన్‌ను వీడాలనుకుంటున్న పౌరుల తరలింపు సురక్షితంగా జరిగేందుకు మా మిలటరీ మిషన్‌ను ముగించడమే ఉత్తమ మార్గమని వారు అభిప్రాయపడ్డారు.'' అని బైడెన్ పేర్కొన్నారు. అమెరికన్లు, ఆఫ్ఘన్ భాగస్వాములు, విదేశీయులు ఎవరైనా సురక్షితంగా దేశం వీడి వచ్చేలా చూసేందుకు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి సమన్వయం వహించాలంటూ విదేశాంగ మంత్రిని కోరినట్టు బైడెన్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మానవతా సాయం అందించేందుకు, అలాగే ఆ దేశం వీడి వచ్చేయాలనుకునే వారిని అనుమతించేందుకు ఎయిర్‌పోర్ట్‌ను తెరిచి వుంచేందుకు తాలిబన్లతో దౌత్య మిషన్ కొనసాగుతుందని చెప్పారు. సెప్టెంబరు 1 నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో తమ ఉనికి వుండకూడదన్నది ప్రస్తుతం తమ ప్రణాళిక అని వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి జెన్‌సాకి తెలిపారు. అయితే అక్కడ నుంచి వచ్చే వారి కోసం అవసరమైన క్రమం చేపట్టేందుకు గానూ దౌత్య పరమైన సంబంధాలు, చర్యలు కొనసాగుతాయని చెప్పారు. త్వరలో దీనిపై వివరాలు తెలియచేస్తామన్నారు.