Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్ఘన్లో రెండు దశాబ్దాల యుద్ధానికి తెర
- తాలిబన్ల అదుపులోకి కాబూల్ ఎయిర్పోర్ట్
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్పై రెండు దశాబ్దాల పాటు అమెరికా సాగించిన దురాక్రమణపూరిత దాడికి తెరపడింది. కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా చివరి సైనికుడు సోమవారం అర్ధరాత్రికి ఒక్క నిమిషం ముందు కాబూల్ వీడి విమానంలో స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఆ వెంటనే కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకుని స్వేచ్ఛాయుత సార్వభౌమాధికార దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడిందని ప్రకటించారు. ఆఫ్ఘన్ చరిత్రలో ఇదొక ముఖ్యమైన పరిణామం. అమెరికా నిష్క్రమణతో లాంఛనంగా అధికారం చేపట్టిన తాలిబాన్లు మొదట అన్ని గ్రూపుల భాగస్వామ్యంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించారు. దాదాపు లక్షా 23వేల మందిని దేశం నుండి తరలించారు. వీరిలో 5,400మంది అమెరికన్లు వున్నారు. రెండు దశాబ్దాల పాటు వారికి సహకరించిన ఆఫ్ఘన్లు, వారి కుటుంబాలు కూడా వున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అమెరికా ఎంబసీల్లో ఒకటైన, 80 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించిన కార్యాలయం నుండి చిట్టచివరిగా అమెరికా దౌత్య సిబ్బంది వెళ్లిపోయారు.
ఒకపక్క అమెరికా ఉపసంహరణ క్రమం కొనసాగుతున్న సమయంలోనే మరోపక్క కాబూల్ విమనాశ్రయంలో, చుట్టుపక్కల గందరగోళ, భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఐసిస్-ఖొర్సా జరిపిన తీవ్రవాద దాడిలో 13మంది అమెరికన్ సైనికులతో పాటు 170మంది ఆఫ్ఘన్లు మరణించారు. ఆ దాడులకు ప్రతిగా అమెరికా జరిపిన దాడిలో గుర్తు తెలియని సంఖ్యలో పౌరులు మరణించారు. సోమవారం కూడా కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద రాకెట్ దాడులు జరిగాయి. ఇదంతా చూస్తుంటే 1975లో వియత్నాం నుండి అమెరికా బలగాలు వైదొలగిన పోలిక గుర్తు వస్తోంది. ఆనాడు కూడా కాల్పుల నీడలోనే సైగన్ నగరంలోని అమెరికా ఎంబసీ నుండి విమానం బయలుదేరింది. ఈనాడు కూడా అమెరికా బలగాలు అత్యంత అవమానకరమైన రీతిలోనే ఆఫ్ఘన్ నుండి వైదొలగాల్సి వచ్చింది. మొత్తంగా ఆఫ్ఘన్ ఆపరేషన్ పట్ల, బైడెన్ ప్రభుత్వ అసమర్ధ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 20ఏళ్ల సామ్రాజ్యవాద జోక్యం సృష్టించిన పరిస్థితుల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆఫ్ఘన్లో సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వైఫల్యంతో ప్రజల్లో విద్వేషం, ఆగ్రహం నెలకొన్నాయి.