Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీ రాజధాని బెర్లిన్‌లో వేలాది మంది ర్యాలీ
బెర్లిన్ : సామాజిక న్యాయం కోరుతూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో శనివారం వేలాదిమంది ప్రజలు మార్చ్ నిర్వహించారు. దేశంలో మరింత సమగ్రమైన, ప్రగతిశీల సమాజం రావాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈనెల 26న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు వారాల ముందుగా 350కి పైగా సంస్థలు రాజధానిలో ఈ మార్చ్‌కు పిలుపునిచ్చాయి. ఈ సంస్థల జాబితాలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు ఫ్రైడేస్ ఫ్యూచర్, మహిళా హక్కుల సంఘాలు, శరణార్థుల మద్దతు గ్రూపులు ఉన్నాయి. దేశంలో జాత్యాహంకారంపై ఐక్యపోరు మరింత విస్తృతం కావాలని ర్యాలీ సందర్భంగా ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
శరణార్థులకు హక్కులు కల్పించాలని, ఉదార ఆశ్రయ విధానం తీసుకురావాలని, గ్లోబల్ వార్మింగ్‌పై బలమైన పోరు సలపాలని కోరారు. శాంతియుతంగా జరిగిన ఈ ఆందోళనల్లో దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని ఉంటైల్బార్ అని పిలువబడే గ్రూపుల కూటమి పేర్కొంది. సామాజిక న్యాయం, మానవ హక్కులు, పర్యావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు ప్రధానంగా డిమాండ్ చేశారని జర్మనీ వార్తా సంస్థ డిపిఎ నివేదించింది.