Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన చైనా
బీజింగ్ : తాజాగా తమ మానవ హక్కుల కార్యాచరణ ప్రణాళికను చైనా గురువారం ప్రచురించింది. 2021-2025 మధ్య కాలంలో మానవ హక్కుల పరిరక్షణకు, పెంపునకు తీసుకోవాల్సిన లక్ష్యాలు, చేపట్టాల్సిన కర్తవ్యాలను అందులో వివరించింది. ఈ కార్యాచరణ ప్రణాళికలో ఎనిమిది భాగాలు వుంటాయి. ''ఉపోద్ఘాతం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు, పౌర, రాజకీయ హక్కులు, పర్యావరణ హక్కులు, ప్రత్యేక గ్రూపుల హక్కుల రక్షణ, మానవ హక్కులపై విద్య, పరిశోధన, అంతర్జాతీయ మానవ హక్కుల పాలనలో పాల్గొనడం, అమలు, పర్యవేక్షణ, అంచనా'' వంటి భాగాలు వున్నాయి. 2009 నుంచి మానవ హక్కులపై చైనా మూడు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, అమలు చేసింది. ఈ సమయంలో, చైనీయుల హక్కులు మరింత మెరుగైన రీతిలో పరిరక్షించబడ్డాయని, ప్రత్యేక గ్రూపుల హక్కులను కాపాడే విధానాలు, చట్టపరమైన చర్యలు మెరుగయ్యాయని ఆ కార్యాచరణ ప్రణాళిక పేర్కొంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రయోజనాలకు చైనా బాగా కృషి చేసిందని పేర్కొంది. ప్రజా కేంద్రీకృత విధానానికి చైనా ప్రభుత్వం కట్టుబడి వుంటుంది, మానవ హక్కుల పరిరక్షణలో పెరుగుతున్న ప్రజల అంచనాలను అందుకోవడానికి కృషి చేస్తుందని పేర్కొంది. ప్రజలు ప్రధాన స్థానంలో వుండేలా ఇది హామీ కల్పిస్తుందని పేర్కొంది. ప్రజల కొరకే అభివృద్ధి, ఆ ప్రయోజనాలన్నీ వారికే అందేలా చూస్తుందని స్పష్టం చేసింది. సామాన్యుల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధిని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను కాపాడుతూ వారికి మరింత మెరుగైన జీవితాన్ని అందివ్వడమే లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ లక్ష్య సాధనకు మరింత అనుకూలమైన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను సృష్టించాల్సి వుందని కార్యాచరణ ప్రణాళిక పేర్కొంది.