Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంథకారంలో పలు ప్రాంతాలు
కారకస్ : వెనిజులా విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఆదివారం మరో తీవ్రవాద దాడి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి నెస్టర్ రెవరాల్ తెలిపారు. కారకస్ ఏరియాలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ఉత్తర అరగ్వా రాష్ట్రంలోని జోస్ ఏంజెల్ లామాస్ మున్సిపాలిటీలో విద్యుత్ సబ్ స్టేషనన్‌లో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయని మంత్రి మీడియాకు తెలిపారు. దీంతో సెంట్రల్ జిల్లాలో విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. పలు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఇదే రీతిలో విద్యుత్ సంక్షోభాలను ఎదుర్కొన్నాయన్నారు. ఈ పేలుడు అనేది వెనిజులా విద్యుత్ వ్యవస్థపై కొత్త తరహా తీవ్రవాద దాడి అని ఆయన స్పష్టం చేశారు. తమ దేశంపై బహుముఖాలుగా జరుగుతున్న దాడుల్లో భాగమేనని పేర్కొన్నారు. విద్యుత్ గ్రిడ్‌ను ధ్వంసం చేయడం ఈ యుద్ధంలో కీలకమైన అంశమని అన్నారు. ఇటువంటి యత్నాలను తిప్పికొట్టడానికి ప్రభుత్వం, జాతీయ విద్యుత్ వ్యవస్థలు పోరాటం చేస్తున్నాయన్నారు. సెంట్రల్ జిల్లాలో విద్యుత్‌ను పూర్తిగా పునరుద్ధరించినా, ఇంకా ఇతర చోట్ల గ్రిడ్‌ను పూర్తి స్థాయి సామర్ధ్యానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. కేవలం ఈ ఏడాది కాలంలోనే దేశంలో దాదాపు 38వేల విద్యుత్ పరికరాలు ధ్వంసమయ్యాయి. 96వేలకు పైగాసార్లు విద్యుత్ అంతరాయాలు కలిగాయి. వెనిజులా విద్యుత్ వ్యవస్థపై ఇటువంటి దాడులు చాలా పెరిగాయి. అయితే ఎవరు కారకులనేది మంత్రి వెల్లడించలేదు. తమ దేశాన్ని దెబ్బతీసి, మదురోను తొలగించాలన్నది అమెరికా లక్ష్యంగా వుందని వెనిజులా అధికారులు ఆరోపిస్తున్నారు.