Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో
ప్రసంగించనున్న నేతలు
ఐక్యరాజ్య సమితి : వచ్చే వారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లు ప్రసంగించనున్నారు. 21 నుండి 27వరకు జరగనున్న వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వందమందికి పైగా దేశ, ప్రభుత్వాధినేతలు న్యూయార్క్ చేరుకోనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఈ కార్యక్రమం అంతా వీడియా సమావేశాల ద్వారా సాగింది. ఈ నెల 25న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాల్లో మోడీ ప్రపంచ నేతలనుద్దేశించి మాట్లాడతారు. అంతకుముందు రోజే 24న బైడెన్ ఆతిథ్యమిచ్చే క్వాడ్ నేతల సదస్సుకు కూడా మోడీ హాజరుకానున్నారు. మోడీ, బైడెన్లతో పాటుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడె సుగాలు కూడా ఈ సమావేశంలో పాల్గొని గత ఆరుమాసాల్లో జరిగిన పురోగతిని సమీక్షిస్తారు. పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ అంశాలను కూడా చర్చిస్తారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ''కోవిడ్ నుండి కోలుకుని పూర్వపు స్థితికి రావడం, సుస్థిరతను పునర్నిర్మించుకోవడం, ప్రపంచ అవసరాలకు తగిన రీతిలో స్పందించడం, ప్రజల హక్కులను గౌరవించడం, ఐక్యరాజ్య సమితిని పరిపుష్టం చేయడం'' ప్రధాన అంశాలుగా జనరల్ అసెంబ్లీలో చర్చ జరగనుంది. 109మంది నేతలు జనరల్ అసెంబ్లీలో మాట్లాడతారు. దాదాపు 60మంది తమ ప్రసంగాలను రికార్డు చేసి పంపుతారు. బ్రెజిల్ నేత మొదటగా ప్రసంగం చేయనుండగా అమెరికా రెండో స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి చివరిలో ప్రసంగించనున్నారు.