Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించి నెల రోజులు పూర్తి అయింది. తాలిబన్లు తమ కొత్త ప్రభుత్వంలోని మంత్రుల పేర్లను ప్రకటించారు. ఇది నాణ్యానికి ఒక వైపు మాత్రమే రెండో వైపున దేశంలో తీవ్ర ఆహార కొరత ప్రజలను అతలా కుతలం చేస్తున్నది. దాదాపు 30 సంవత్సరాల నుంచి అఫ్ఘాన్ ఏదో ఒక రకమైన యుద్ధంలో కొట్టు మిట్టాడుతున్నది. యుద్ధం వలన అత్యధిక మంది ప్రజలు ఆహారం, తాగునీరు కోసం స్వచ్ఛంద సంస్థల సహాయం పైననే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతున్నది. అందుకే ఐక్యరాజ్యసమితి కూడా అఫ్ఘాన్‌లో మానవ సంక్షోభం ఏర్పడిందని ప్రతి ఒక్క దేశం సహాయం చేసి ఆ దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలని పిలుపును ఇచ్చింది. తన వంతుగా ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది. ప్రజల దగ్గర గోదుమ పిండి, వంటనూనె కూడా లేదని ఏమి తిని బతుకుతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొంత మంది డబ్బుల కోసం తమ దగ్గర ఉన్న సామాన్లను అమ్ముకోవడానికి సిద్ధం అయినా కొనేవారు లేరని అంటున్నారు. చిన్న పిల్లలు ఆకలితోనే పడుకోవాల్సి వస్తున్నదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మరో వైపు వానలు లేక 34 జిల్లాలకు కరువు తాండవిస్తున్నది.