Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 101 కోట్ల మందికి ఉచిత టీకా ఇచ్చిన ఘనత
బీజింగ్ : కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా అందించడంలో చైనా కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వంద కోట్ల మందికిపైగా ప్రజలకు చైనా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసింది. ఈ సంఖ్య మొత్తం జనాభాలో 71శాతంగా వుందని అధికార గణాంకాలు తెలిపాయి. కరోనా వైరస్‌ను విజయవంతంగా నియంత్రించిన చైనా మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలోనూ ముందంజలో వుంది. ఆగేయ చైనాలో కొత్త వేరియంట్ తలెత్తడంతో చైనా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ నెల 15నాటికి దేశవ్యాప్తంగా 216 కోట్ల వ్యాక్సిన్ల డోసులు అందజేశామని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ పత్రికా సమావేశంలో తెలిపారు. 101 కోట్ల మందికిపైగా ప్రజలకు టీకాలు వేశామని చెప్పారు. గతేడాది చైనా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ సంస్థ అయిన సినోఫార్మాకి చెందిన వ్యాక్సిన్‌కు గతేడాది షరతులతో కూడిన ఆమోదం లభించింది. అప్పటి నుంచి దేశీయ కంపెనీలు, విద్యాసంస్థలు మరో ఆరు వ్యాక్సిన్లను రూపొందించాయి. ప్రస్తుతం 12ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్లు వేయడానికి చైనా అనుమతించింది. గత మార్చి నుంచి కోవిడ్ ఉచిత వ్యాక్సిన్లను చైనా ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి 27నాటికి కోటి టీకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాజధాని బీజింగ్‌లో 97శాతం మందికి పైగా యువజనులు పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నారు.