Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధార పౌరుల తొలి అంతరిక్ష యాత్ర విజయవంతం
కేప్ కెనెరవాల్ : చరిత్రలో తొలిసారిగా పూర్తిగా ప్రయివేటు సాధారణ పౌరులతో జరిగిన అంతరిక్ష యాత్ర విజయవంతమయింది. మూడు రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన నలుగురు పర్యాటకులు సురక్షితంగా భూమికి తిరిగివచ్చారు. మూడు రోజుల పాటు భూమి చుట్టూ తిరిగిన స్పేస్ ఎక్స్‌కు చెందిన క్యాప్సూల్ ఆదివారం ఫ్లోరిడా తీరానికి దగ్గరిగా అట్లాంటిక్ మహాసముద్రంలో దిగింది. ఈ క్యాప్సూల్‌లో ప్రయాణించిన నలుగురూ ఎలాంటి వృత్తిపరమైన శిక్షణా లేని వారు. స్పేస్ఎక్స్కు చెందిన పూర్తిగా ఆటోమేటెడ్ డ్రాగన్ క్యాప్సూల్ బుధవారం రాత్రి భూమి నుంచి బయలుదేరి తరువాత అసాధారణంగా 585 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 160 కిలోమీటర్లు దాటిన తరువాత, క్యాప్సూల్ పైభాగానికి జోడించబడిన పెద్ద బుడగ ఆకారపు కిటికీ ద్వారా ఈ నలుగురూ భూమిని వీక్షించారు. తరువాత మళ్లీ శనివారం రాత్రికే భూ వాతావరణంలో ప్రవేశించారు. అట్లాంటిక్ మహా సముద్రంలో దిగిన తరువాత యాత్రీకులను వైద్య పరీక్షల కోసం కెన్నడీ స్పేస్ సెంటర్‌కు హెలికాప్టర్ ద్వారా తరలించారు. నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్‌ను స్పేస్ ఎక్స్ లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర చేసిన వారిలో ఒకరైన ఇజాక్‌మన్ (38) ఒక వ్యాపారవేత్త, పైలట్‌గానూ శిక్షణ పొందారు. హేలీ ఆర్సినో (29) చిన్నతనంలో ఎముక క్యాన్సర్ బారినపడ్డారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత ఇదే ఆసుపత్రిలో వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన అత్యంత పిన్న వయస్కురాలిగా, కృత్రిమ అవయవంతో తొలి వ్యక్తిగా హేలీ గుర్తింపు పొందనున్నారు. క్రిస్ సెంబ్రోస్కి (42) ఏరోస్పేస్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అమెరికా వైమానిక దళంలో పనిచేశారు. సియాన్ ప్రాక్టర్ (51) జియో సైంటిస్ట్, ఆర్టిస్ట్, సైన్స్ రచయిత్రిగా మంచి గుర్తింపు పొందారు. అంతరిక్షంలో వీరు కొల్డ్ పిజ్జా, శాండ్విచ్లు తీసుకున్నారు.
కాగా, సుమారు 60 ఏండ్ల క్రితం ప్రారంభమైన మానవుడి అంతరిక్ష యాత్ర ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 600 మంది అంతరిక్షంలో వెళ్లి వచ్చారు. రానున్న రోజుల్లో ఇది మరింతగా విజృంభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నాలుగు స్పేస్ఎక్స్ విమానాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. రష్యా కూడా వచ్చే నెలలో ఒక చిత్ర దర్శకుడ్ని, డిసెంబర్లో జపాన్ వ్యాపారవేత్తను అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లడానికి ప్రణాళికలు వేస్తోంది.