Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ఆర్థిక దిగ్బంధనాలకు ఖండన
మెక్సికో : క్యూబాపై అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్, కరేబియన్ స్టేట్స్ (సీఈఎల్‌ఏసీ) శిఖరాగ్ర సదస్సు తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా మాల్వినాస్ దీవులపై అర్జెంటీనా సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించింది. మెక్సికో అధ్యక్షతన శనివారంసీఈఎల్ఏసీ 6వ సదస్సు జరిగింది. సదస్సుకు సంబంధించిన వివరాలను మెక్సికో విదేశాంగ మంత్రి ఎబ్రార్డ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 44 పాయింట్లు, ఇతర ప్రత్యేక ఒప్పందాలతో కూడిన ఒక ఉమ్మడి డిక్లరేషన్‌పై 31 దేశాలకు చెందిన అధికారులు సంతకాలు చేశారని తెలిపారు. 1.5 కోట్ల డాలర్ల కేటాయింపుతో పాటు కోవిడ్-19, భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యయిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఒక ప్రాంతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సదస్సు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర నిధి ఏర్పాటును ఉమ్మడి డిక్లరేషన్ ఆమోదించింది. ఈ ప్రాంత శాస్త్రీయ అభివద్ధిని పెంచేందుకు లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ స్పేస్ ఏజెన్సీ రాజ్యాంగాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా ఎబార్డ్ అభివర్ణించారు. ''ఏదైనా మమ్మల్ని ఒక్కటిగా చేసిందంటే.. అది కరోనా మహమ్మారి అని చెప్పవచ్చు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ఈ ప్రాంతం కరోనాతో అధికంగా ప్రభావితమైంది. ఎక్కువగా మరణాలు చోటుచేసుకున్నాయి'' అని ఎబ్రార్డ్ అన్నారు. వ్యాక్సిన్లు పొందడం చాలా కష్టంగా ఉందని, అనేక దేశాలకు టీకాలు ఇంకా సరిపడా అందుబాటులోకి రాకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ''ఉమ్మడి డిక్లరేషన్ అనేది మా స్వరాన్ని ఏకం చేయడానికి, సానుకూలమైన పనులు చేయడానికి, పరస్పర సరహకరించుకునేందుకు, ఈరోజున మనం జీవిస్తున్న అన్యాయమైన ప్రపంచంలో మన మార్గాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఒక పిలుపు'' అని ఎబ్రార్డ్ ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.
సంబంధాల మెరుగుదలకు ప్రాధాన్యత : జిన్‌పింగ్
మెక్సికో ఆహ్వానం మేరకు సిఇఎల్ఎసి సదస్సును ఉద్దేశించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వీడియో ప్రసంగం చేశారు. సిఇఎల్ఎసితో సంబంధాలను పెంపొందించుకునేందుకు చైనా గొప్ప ప్రాముఖ్యతనిస్తుందని, సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రాంతీయ దేశాలను సమన్వయం చేయడంలో మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల స్వతంత్రతను కొనసాగించేందుకు, ఐక్యతను బలోపేతం చేసుకునేందుకు పదేళ్ల క్రితం ఈ సిఇఎల్ఎసి ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రాంతీయంగా ఉమ్మడి అభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు తమ ప్రాంతంలో శాంతి, సమైక్యత, సుస్థిరతను కొనసాగించడంతో ఇది కీలక పాత్ర పోషిస్తోందని జిన్‌పింగ్ చెప్పారు.