Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజూ 2వేల మరణాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ తో అల్లాడుతున్నది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా విసురుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా... ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు రావటం విశేషం. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం అమాంతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌తో శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది చనిపోయారని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మరణించినట్టు తెలిపింది. కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో సెప్టెంబర్ 13న 2.85 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతరం తగ్గుతూ వచ్చాయి. ఈ శుక్రవారం 1.65 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్ బారిన పడుతున్నట్టు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు.