Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ 'ఎబిసి'పై పరువు నష్టం దావా కేసు వేసేందుకు ఒక అనామక సంస్థ నుంచి విరాళాలు సేకరించడంపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో ఆస్ట్రేలియా మంత్రి క్రిస్టియన్ పోర్టర్ తన పదవికి రాజీనామా చేశారు. దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ఆదివారం ఈ విషయం వెల్లడించారు. 1988లో ఓ పదహారేళ్ల బాలికపై ప్రస్తుత కన్సర్వేటివ్ ప్రభుత్వంలోని ఓ సీనియర్ మంత్రి అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఎబిసి ఓ వార్తను ప్రచురించింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా మహిళా హక్కుల సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఆ సమయంలో అటార్నీ జనరల్‌గా ఉన్న క్రిస్టియన్ పోర్టర్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ తరువాత ఆయన పోర్టుఫోలియోను తగ్గించినా మోరిసన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ ప్రభుత్వంలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎబిసి పై దావాకు ఓ ట్రస్టు నుంచి డబ్బులు తీసుకున్నది నిజమేనని పోర్టర్ అంగీకరించారు. అయితే ఆ కేసులో వాదించినందుకు లీగల్ ఫీజు అని సమర్థించుకునే యత్నం చేశారు. పోర్టర్ చర్యలు మంత్రిత్వ శాఖ ప్రమాణాలను ఉల్లంఘిస్తాయా? లేదా? అనేదానిపై మోరిసన్ నిపుణులను స్పష్టత కోరారు. పోర్టర్ రాజీనామా విషయాన్ని వెల్లడించిన మోరిసన్.. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతారని, చివరి బెంచ్‌లో కూర్చుంటారని తెలిపారు.