Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యయనం వివరాలు వెల్లడి
వాషింగ్టన్ : ఐదు నుంచి 11ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లల్లో తమ కోవిడ్ వ్యాక్సిన్ పనిచేస్తుందని ఫైజర్ సోమవారం తెలిపింది. త్వరలోనే ఈ వయస్సు పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు అమెరికా అనుమతిని కోరనున్నట్టు తెలిపింది. ఫైజర్, జర్మనీ భాగస్వామి బయో ఎన్ టెక్‌తో కలిసి రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్ 12ఏండ్లు అంతకుమించి పైన వయస్సు గల వారికి అందుబాటులో వుంది. కానీ, పిల్లలు తిరిగి పాఠశాలలకు వెళుతుండడం, పిల్లల్లో వైరస్ వ్యాప్తిని కలిగించే డెల్టా వేరియంట్ ప్రబలడంతో చాలామంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్ అధ్యయన ఫలితాలు వెలువడ్డాయి. ప్రాథమిక పాఠశాల స్థాయి పిల్లల కోసం ఫైజర్ తక్కువ డోసును పరీక్షించింది. సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఇచ్చే డోసులో మూడవ వంతును ఇందులో ఉపయోగించారు. ఇటువంటి వ్యాక్సిన్ రెండో డోసు ఇచ్చిన తర్వాత 5నుంచి 11ఏండ్ల పిల్లల్లో యాంటీబాడీ స్థాయిలు పెరిగాయనీ, టీనేజర్లు, యువతలో వున్న స్థాయికి చేరుకున్నాయని ఫైజర్ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బిల్ గ్రబర్ మీడియాకు తెలిపారు. పిల్లలకు ఇచ్చే డోసేజి కూడా సురక్షితమేనని రుజువైందన్నారు. చేతులు నొప్పులు, జ్వరం లేదా నొప్పివంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్లు తప్ప మరే సమస్య వుండబోదన్నారు. ఈ నెలాఖరుకల్లా అత్యవసర వినియోగార్ధం అనుమతులు కోరనున్నట్లు తెలిపారు. ఫైజర్ తన అధ్యయన ఫలితాలను వెల్లడించిన తర్వాత తమ సంస్థ ఆ డేటాను సమీక్షిస్తుందని ఎఫ్‌డీఏ చీఫ్ డాక్టర్ పీటర్ మార్క్స్ ఈ నెలాఖరులో మీడియాకు తెలిపారు. చిన్నారులకు వ్యాక్సిన్లు సురక్షితమా కాదా అనేది కొద్ది వారాల్లో తేలిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. 12ఏండ్ల కన్నా చిన్నారులకు వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇంతవరకు పశ్చిమ దేశాలు ముందుకు రాలేదు. కానీ గత వారం క్యూబా తమ వ్యాక్సిన్లు రెండేండ్ల వారికి కూడా ఫలితాలనిస్తున్నాయనంటూ వారికి వేయడం ఆరంభించింది. చైనా కూడా మూడేండ్లలోపు చిన్నారులకు తమ వ్యాక్సిన్లు వేయవచ్చని తెలిపింది.