Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలాదిమంది ప్రజల తరలింపు
మాడ్రిడ్ : స్పెయిన్‌లోని కేనరీ దీవుల్లోని లా పాల్మా దీవిలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిపర్వతం నుండి లావా వెదజల్లుతుండడంతో దాదాపు పది వేల మందిని అక్కడ నుండి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.12గంటలకు తరలింపు ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. లా పాల్మా దీవిలో గత వారం దాదాపు 20వేల సార్లు భూమి కంపించింది. దాని తర్వాత అగ్నిపర్వతం నుండి బూడిద, లావా వెలువడడం ఆరంభమైంది. రిచ్టర్ స్కేలుపై 4గా నమోదైనపుడు అగ్నిపర్వతం క్రియాశీలంగా మారి, పర్వతంలోని ఐదు చీలికల నుండి దట్టమైన పొగ, లావా వస్తున్న ఫోటోలను టివిల్లో ప్రసారం చేశారు. రాత్రయ్యేసరికి ఇది మరింత ఉధృతమైంది. ఇంతవరకు ఎవరూ మరణించినట్లు వార్తలందలేదు. కానీ ఆనేక ఆస్తులు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలతోపాటుగా జంతువులను కూడా తరలించారు. ఈ ప్రాంతంలోని పాఠశాలలన్నింటినీ సోమవారం మూసివేశారు. లావా ప్రవహిస్తుండడంతో నాలుగు రహదారుల్లో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ప్రజలను ఇళ్ళకే పరిమితం కావాల్సిందిగా కోరారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ దీవిని సందర్శించారు. జరుగుతున్న పర్యవేక్షక చర్యలను సమీక్షించారు.