Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒప్పందంపై ఉత్తర కొరియా ఆగ్రహం
ప్యాంగాంగ్ : అణు జలాంతార్గాములను నిర్మించే సాంకేతికతను ఆస్ట్రేలియాకు అందచేయడానికి అమెరికా, బ్రిటన్లు తీసుకుంటున్న చర్యలను ఉత్తర కొరియా విదేశాగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా విమర్శించింది. ఈ ఒప్పందం వల్ల తమ దేశ భద్రతపై కాస్త ప్రతికూల ప్రభావం కనిపించినా తాము కూడా ప్రతి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా, బ్రిటన్ తీసుకుంటున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైన చర్యగా విదేశాంగ శాఖ అభివర్ణించినట్లు అధికార వార్తా సంస్థ కెసిఎన్ఎ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యత దెబ్బతింటుందనీ, అణ్వాయుధ పోటీ అనివార్యమవుతుందని తెలిపింది. తన ప్రయోజనాలు వున్నాయనుకుంటే అమెరికా ఏ దేశానికైనా అణ్వాయుధ సాంకేతికతను బదిలీ చేయగలదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి వ్యాఖ్యానించినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. అమెరికా కొత్త ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని విమర్శించారు. అంతర్జాతీయ శాంతి భద్రతల నిబంధనలను అమెరికా దెబ్బతిస్తోందని అన్నారు. తద్వారా ప్రపంచ శాంతి సుస్థిరతలకు ముప్పుగా పరిణమిస్తోందని విమర్శించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఒప్పందాన్ని, దాన్ని నేపథ్యాన్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఉత్తర కొరియా అధికారి తెలిపారు.