Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాలో మిన్నంటిన యాంటీ వ్యాక్సిన్ నిరసనలు
- ఆందోళనకారులపై పెప్పర్ స్ప్రే
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో యాంటీ వ్యాక్సిన్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులు కనీసం ఒక్క డోసు టీకా అయినా వేసుకొని పనికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిర్మాణరంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు, రబ్బరు తూటాలను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు సహా పలువురికి గాయాలయ్యాయి. అలాగే, 40 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇప్పటికే లాక్డౌన్ కొనసాగుతున్న మెల్బోర్న్లో నిన్నటి నుంచి జరుగుతున్న ఈ ఆందోళనలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. నేటి నుంచి రెండువారాల పాటు అధికారులు కన్స్ట్రక్షన్ సైట్లను మూసివేశారు. కార్మికుల నిరంతర కదలికలతో కొవిడ్ వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ పరిస్థితి తమకు సవాల్‌గా మారిందని విక్టోరియాకు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నిరసనకారులు నినాదాలు చేసుకుంటూ వీధుల్లో ర్యాలీ చేపట్టడం, పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడం వంటి దృశ్యాలు టీవీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నిరసనకారుల్లో నిర్మాణరంగ కార్మికులతో పాటు టీకా తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించేవారు, విక్టోరియాలో లాక్‌డౌన్‌ని పొడిగించడం ఇష్టంలేనివారూ ఉన్నారు.