Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక అభివృద్ధి మండలికి అధ్యక్షుని ప్రశంసలు
హవానా : వియత్నాం అధ్యక్షుడు గుయెన్ జువాన్ ఫక్ క్యూబాలో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా క్యూబాలోని మారియల్ ప్రత్యేక అభివృద్ధి మండలి (జెడ్ఇడిఎం)లో గల వ్యాపార అవకాశాలను గురించి తెలుసుకున్నారు. ఈ వేదికకు గల శక్తి సామర్ధ్యాలు, అవకాశాల గురించి తెలుసుకున్న అధ్యక్షుడు గుయెన్, క్యూబా ప్రభుత్వాన్ని అభినందించారు. క్యూబా ఆర్థికాభివృద్ధిని పెంపొందించేందుకు కీలకమైన పెట్టుబడులను సృష్టించడానికి తీసుకున్న చర్యలను ప్రశంసించారు. పెట్టుబడులకు కీలక రంగాలను గుర్తించాల్సిందిగా తనతో పాటు వచ్చిన మంత్రులను, వాణిజ్యవేత్తలను గుయెన్ కోరారు. ఈ పెట్టుబడుల వల్ల క్యూబన్లకు సమర్ధవంతమైన, ఆచరణాత్మకమైన ప్రయోజనాలు అందాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, సహకారాన్ని విస్తరించుకునేందుకు ఈ పర్యటన ఉద్దేశించబడిందని అన్నారు. జెడ్ఇడిఎంలో పెట్టుబడులను కలిగివున్న దేశాల్లో వియత్నాం రెండో స్థానంలో వుంది. మొదటి స్థానంలోకి రావాలన్నది వియత్నాం ప్రయ్నతమని గుయెన్ చెప్పారు. క్యూబా తమకు పెట్టుబడుల కేంద్రంగా వుందన్నారు. జెఇడిఎంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టిన మొదటి వియత్నాం కంపెనీ థాయి బిన్ గ్లోబల్ ప్రస్తుతం కోటీ 40లక్షల డాలర్లను తిరిగి పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకొచ్చింది.