Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన సదస్సులో క్యూబా అధ్యక్షుని పిలుపు
ఐక్యరాజ్య సమితి : మరింత సమానత్వంతో కూడిన, న్యాయమైన, ప్రజాస్వామ్య యుతమైన ప్రపంచ వ్యవస్థ కోసం కలిసికట్టుగా కృషి చేయాలని క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఇటువంటి వ్యవస్థలో ఏ ఒక్కరూ కూడా వెనుకబడరాదని అన్నారు. ఆన్లైన్లో జరిగిన జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సమావేశంలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మెజారిటీ దేశాలకు ఈ లక్ష్యాలనేవి దశాబ్ద కాలంలో సాధించేవిగా కనిపించడం లేదని అన్నారు. అన్యాయమైన రీతిలో, అప్రజాస్వామికమైన అంతర్జాతీయ వ్యవస్థ ఈ అసమానతలకు కారణమవుతోందని అన్నారు. ఈనాడు పలు దేశాలు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, తాజాగా కోవిడ్ పరిణామాలతో పరిస్థితి మరింత దుర్భరంగా మారిందన్నారు. ప్రపంచ వ్యవస్థ ఈ రీతిన వున్నంతకాలమూ ఆదర్శప్రాయమైన ఈ లక్ష్యాలు సాధించకుండా అలాగే వుండిపోతాయన్నారు. 2030 ఎజెండా అమలు చేసి, ఆర్థిక, సామాజికాభివృద్దిలో ముందంజ వేయడానికి అమెరికా ఆంక్షలు అవరోధాలను సృష్టిస్తున్నాయని అన్నారు. అయినా, సార్వభౌమాధికారంతో కూడిన, స్వతంత్ర, సోషలిస్టు, ప్రజాస్వామ్య, సంపద్వంత సుస్థిర దేశాన్ని నిర్మిస్తామని మిగ్వెల్ స్పష్టం చేశారు. సమానత్వంతో కూడిన, ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలు కలిగిన దేశంగా వృద్ధి చెందుతామన్నారు. వినూత్నమైన, శాస్త్రీయ పరిశోధనను క్యూబా పెంపొందిస్తుందని చెప్పారు. పేద దేశాల మధ్య సహకార చట్ర పరిధిలో ఇతర దేశాలతో తమ అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు బహుళపక్షవాదం బలోపేతం కావాలని, సంఘీభావంతో కూడిన సహకారం వుండాలని, సామాన్య సమస్యలకు అంతర్జాతీయ పరిష్కారాలకై అన్వేషణ జరగాలని పిలుపిచ్చారు.